- కండ్లద్దాలు పెట్టుకొని కూడా తప్పులు చదివినవ్
హైదరాబాద్, వెలుగు: సీఆర్ఐఎఫ్ రోడ్లకు హ్యామ్ రోడ్లకు తేడా తెల్వదా అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. కండ్లద్దాలు పెట్టుకొని కూడా తప్పులు చదివావు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో చేపట్టబోయే రోడ్లలో రూ.8 వేల కోట్ల స్కాం జరుగుతోందని ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై శనివారం మంత్రి వెంకట్రెడ్డి స్పందించారు.
బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటుంటే జాలేస్తోందన్నారు. ‘‘ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే. కానీ, ఇయ్యాల ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత అజ్ఞానా? అనిపిస్తోంది. సీఆర్ఐఎఫ్ రోడ్లకు, హ్యామ్ రోడ్ల విధానానికి చాలా తేడా ఉంది. ఈ విషయం గతంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ కు తెలియకపోవడం బాధాకరం.
హ్యామ్ మోడల్ ఎన్హెచ్ఏఐ నార్మ్స్ ప్రకారం రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 15 ఏండ్ల మెయింటెనెన్స్ కింద రూ.20 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కి.మీ రూ.6 కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రశాంత్ రెడ్డి అసత్యాలు మాట్లాడారు” అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హ్యామ్ విధానం తెలంగాణలో కొత్తగా తెచ్చింది కాదన్నారు.
