
- మధ్యప్రదేశ్ లో మైనారిటీ స్కాలర్ షిప్ స్కామ్
భోపాల్: మధ్యప్రదేశ్ లో లక్షలాది రూపాయల విలువైన స్కాలర్ షిప్ స్కామ్ బయటపడింది. భోపాల్ లోని 40కిపైగా మదర్సాలు, మైనారిటీ స్కూళ్లు నకిలీ విద్యార్థులను ఉపయోగించి ప్రభుత్వ నిధులను స్వాహా చేశాయి. భోపాల్ లోని ఆమ్ వాలి మసీదు సమీపంలో ‘సిటీ మాంటిస్సోరి స్కూల్’ చిరునామాకు మొదట అధికారులు వెళ్లగా ఖాళీ రహదారులు దర్శనమిచ్చాయి. చివరకు ఒక బిల్డింగ్ పై సిటీ మాంటిస్సోరి అని పేరు రాసి ఉంది. కానీ, అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులు లేరు.
తరగతులు కూడా జరగడం లేదు. స్కూల్ కూడా ఎప్పుడు ఓపెన్ చేయలేదని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ, అక్కడ ఒకటి నుంచి ఎనిమిది వరకు తరగతులు జరుగుతున్నట్టు 29 మంది విద్యార్థుల పేర్లతో స్కూల్ రూ.1.65 లక్షల స్కాలర్‌షిప్ ను క్లెయిమ్ చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయి.
క్రైమ్ బ్రాంచ్ పరిశీలనలో 100 స్కూళ్లు
మధ్యప్రదేశ్ లోని పలు స్కూళ్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ 100కుపైగా పాఠశాలలపై నిఘా పెట్టింది. సరైన గుర్తింపు లేని అనేక సంస్థలు 8వ తరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహంచాలని సూచించింది. అయితే, కొన్ని స్కూళ్లు11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థుల పేర్లతో స్కాలర్ షిప్ లను క్లెయిమ్ చేశాయి. 972 మంది విద్యార్థుల పేర్లతో రూ. 57.78 లక్షలను ప్రభుత్వం నుంచి పొందాయి.