అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: ఏపీలోని గుడివాడ కేంద్రంగా ఈ నెల 19 నుంచి 23వరకు జరిగే స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ జాతీయ స్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీల్లో తెలంగాణ సత్తాను చాటాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ఇటీవల పటాన్చెరులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలికల పోటీల్లో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు శనివారం ట్రాక్ సూట్లు, షూస్, ప్రయాణ ఖర్చులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..తాను క్రీడాకారుడినని, క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో పటాచెరులో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమారి, రవి, మల్లికార్జున, రాజశేఖర్ పాల్గొన్నారు.
జనవరి 19 నుంచి మైత్రి క్రికెట్ ట్రోఫీ
జనవరి19 నుంచి 26వరకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించే మైత్రి క్రికెట్ ట్రోఫీ ఆహ్వాన పత్రికను శనివారం సాయంత్రం క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 35 ఏళ్లుగా పటాన్చెరు పరిధిలో క్రికెట్ అభివృద్ధి కోసం మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి పాల్గొన్నారు.
