- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: పంట దిగుబడులకు అనుగుణంగా అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మిరుదొడ్డిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు కొనుగోలు కేంద్రంలో జాలి యంత్రాలు పనిచేయక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, వారం రోజులైనా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో ఫోన్ లో మాట్లాడి మార్కెట్లో సరైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
దుబ్బాక, దౌల్తాబాద్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మిరుదొడ్డిలో కూరగాయల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ కార్యదర్శి రేవంత్ ను ఆదేశించారు. రాంపూర్ లోని బాలికల గురుకుల కాలేజీని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గానికి చెందిన 141మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి, బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
