కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి రేగా : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి రేగా : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పొదెం వీరయ్య

 మణుగూరు, వెలుగు : రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన ద్రోహి రేగా కాంతారావు అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పొదెం వీరయ్య మండిపడ్డారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి 2019లో పార్టీ మారిన కాంతారావు కార్యాలయాన్ని సైతం కబ్జా చేశారని తెలిపారు. కబ్జాల కాంతారావుకు ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. 1980లో మణుగూరులోని కాంగ్రెస్ మీద అభిమానంతో 3 సెంట్ల స్థలాన్ని ఇస్తే కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారన్నారు. 

2009 నుంచి 2019 వరకు పార్టీ ఇన్​చార్జిగా ఉన్న కాంతారావు పార్టీ మారే సమయంలో కార్యాలయాన్ని సైతం కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించాడని ఆరోపించారు. ఇప్పటివరకు మున్సిపల్ రికార్డుల్లో కాంగ్రెస్ కార్యాలయంగానే నమోదై ఉందని, అయినా అది తన సొంత ఆస్తి అంటూ కాంతారావు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు తమ కార్యాలయాన్ని అప్పగించాలని కార్యకర్తలు కోరినా ఆయన పట్టించుకోలేదని, చివరికి మున్సిపల్ అధికారులు నోటీసులు పంపినా స్పందించలేదన్నారు. కడుపు మండిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే.. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఫర్నిచర్ ధ్వంసం అయిందని,  ఎట్టకేలకు తమ కార్యాలయం సొంతమైందన్నారు. ఇప్పటికైనా కాంతారావు తన తప్పు తెలుసుకొని పద్ధతిగా నడుచుకోవాలని హితవుపలికారు.