- కృష్ణానది, సాగర్ లో నీళ్లున్నా ఖమ్మంలో పంటలు ఎండుతున్నయ్: హరీశ్‌రావు
- కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా?
- రైతులకు ఎకరాకు 25వేలు సాయం అందించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. మూడు లక్షల ఎకరాలు ఎండబెడతారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. కృష్ణానది, సాగర్ లో నీళ్లున్నా.. పంటలన్నీ ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా? అని నిలదీశారు. సోమవారం తెలంగాణ భవన్ లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో ఎండిపోతున్న పంటలపై ఆయన మాట్లాడుతూ.. 22 రోజులైన కాల్వకు గండి పూడ్చడం చాతకాగ.. రైతుల పొలాలను కాంగ్రెస్ ఎండ పెడుతోందన్నారు.
పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారని, పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని అన్నారు. గతేడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయని..ఈసారి పుష్కలంగా వర్షాలు పడినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రైతులకు ఎకరాకు రూ.25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
పార్టీ తరఫున ఖమ్మం జిల్లాకు వెళ్తామని, రైతులకు మనోధైర్యం చెప్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్వాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15న ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టును ప్రారంభించి.. సీఎం, మంత్రులు డైలాగులు కొట్టారని విమర్శించారు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారని.. మరి ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రైతులు ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో గూండాల రాజ్యం
శివ్వంపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. గూండాల రాజ్యం నడుస్తోందని హరీశ్‌రావు విమర్శిం చారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును చెడగొట్టి బిహార్‌లా మారుస్తున్నారని ఫైర్అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం రాత్రి మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని నర్సాపూర్ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద గొడవ జరగగా.. సోమవారం హరీశ్‌రావు వెళ్లి సునీతా లక్ష్మారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటిమీద దాడిని ఖండించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకులు కాల్చి ఇంట్లోకి విసరడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
