బీసీలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్రు : తీన్మార్ మల్లన్న

బీసీలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్రు : తీన్మార్ మల్లన్న
  • ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్​ నగరంలోని ఒక హోటల్​లో జిల్లా బీసీ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించి, మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సెగ్మెంట్​లో 10 వేల మంది ఓటర్లు లేని ఓసీలు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారం చెలాయిస్తుంటే, బీసీలు రాజకీయ అణిచివేతకు గురవుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్  కోసం ఉద్యమిస్తున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి డ్రామాలు చేస్తుండగా, బీజేపీ దూరంగా ఉంటోందన్నారు. 

బీసీ నినాదం బీజేపీకి ఉరితాడుగా మారుతుందని చెప్పారు. కేసీఆర్​ నోటి నుంచి బీసీ పదమే రావడం లేదన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్  ఫిక్స్​ చేసి మిగితావి పంచుకుంటారా?​ అని ప్రశ్నించారు. ఓటర్లలో 15 శాతం ఉన్న ఓసీ నేతలు అధికారం చెలాయిస్తూ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుడేందని, వారి వాటా తేల్చుకొని వెళ్లిపోవాలని సూచించారు. ఇన్నాళ్లూ బీసీల శ్రమ, ఆత్మగౌరవాన్ని దోపిడీ చేశారని, రాజకీయంగా అణిచివేశారన్నారు. 

బీసీ వాదం బలంగా ఉండడంతోనే రెడ్లు, వెల్మలు ఢిల్లీలో ధర్నా చేశారని, ఇది బీసీల విజయమేనన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీసీలతో ఎలాంటి సంబంధంలేదన్నారు. 2028లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు. బీసీ పొలిటికల్​ జేఏసీ కో- ఆర్డినేషన్​ కమిటీ చైర్మన్​ హరిశంకర్​గౌడ్, జానయ్య యాదవ్, సూర్యారావు, నర్సయ్యగౌడ్, ఓదెలు యాదవ్, బుస్సాపూర్​ శంకర్, రమేశ్​ యాదవ్​ ఉన్నారు.