- నిందితులపై మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు జాతరలో జరిగిన ఘర్షణలో రెండు నెలల చిన్నారి మృతిచెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డీఎస్పీ శ్రీనివాసులును కలిసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అయితే దాడికి పాల్పడ్డ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధిత బీసీ కుటుంబంపై కేసులు నమోదు చేయడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా వెళ్లి, మృతిచెందిన శిశువు సమాధి వద్ద నివాళులర్పించారు. ఘటనకు బాధ్యులైన 8 మందిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. జాతరలో ఘర్షణ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కుమ్మెరకు చెందిన మధు, సతీశ్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి, నరేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గణేశ్ కుటుంబంపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించారని గణేశ్ భార్య మౌనిక ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దాడిలో తన రెండు నెలల కుమార్తె మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు నమోదు
పద్మారావునగర్: నాగర్‌కర్నూల్ జిల్లాలో దేవాలయంలోకి ప్రవేశం నిరాకరించిన నిర్వాహకులు దంపతులపై దాడి చేయగా, వారి చేతిలో ఉన్న రెండు నెలల పసిబిడ్డ కిందపడింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శిశువు మృతిచెందినట్లు ఆరోపలున్నాయి. స్థానికంగా నిర్వహించిన వేడుకలో ఉన్నత కులానికి చెందిన నిర్వాహకులే ఈ దాడికి పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఘటనపై హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేయడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
