- కలెక్టర్లు, ఆఫీసర్లు ప్రతినెలా బ్లాక్ స్పాట్లను విజిట్ చేయాలి
- సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి రోడ్డు నిబంధనలు పాటిస్తామని, యువత, విద్యార్థుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్నగరంలోని పంచవటి విద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి మంత్రి పొన్న ప్రభాకర్‌తో పాటు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు వారు ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ నుంచి పంచవటి విద్యాలయం వరకు హెల్మెట్ ధరించి, బైక్‌పై ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన మానవహారాన్ని పరిశీలించారు. రోడ్ సేఫ్టీ అవేర్సెన్లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్, కంటి వైద్య శిబిరాలను మంత్రులు ప్రారంభించారు. విద్యాలయంలో పిల్లల ట్రాఫిక్ అవేర్నెన్స్ పార్కును ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అరైవ్ అలైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్‌లో హాస్పిటల్లో చేర్చి, వారి ప్రాణాలను కాపాడిన వారిని గుర్తించి ‘రహవీన్’' అవార్డు పథకం కింద ప్రభుత్వం పారితోషికం అందిస్తుందని చెప్పారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించడానికి యూనిసెఫ్ సహకారంతో స్కూల్స్‌లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెన్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ‘మేము రోడ్డు నింబంధనలు పాటిస్తాం’ అనే హామీ పత్రాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతినెలా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు బ్లాక్ స్పాట్స్‌ను గురించి, అక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అతి వేగం, నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
పిల్లలకు వాహనాల కొనిచ్చేటప్పుడు పెద్దలు కచ్చితంగా వారికి సూచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నగర మేయర్ మమత, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

