
- దోమల నివారణ మరిచిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు
- నామమాత్రంగా ఫ్రై డే
- వైరల్ ఫీవర్బారిన వనపర్తి జిల్లా ప్రజలు
వనపర్తి, వెలుగు : జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో దోమల నివారణ కోసం సిబ్బంది ఫాగింగ్ చేయడం మరిచారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల వల్ల ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ఫీవర్ బారిన పడుతున్నారు. దోమల నివారణకు అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టే ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో, వైద్యాధికారులు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.
నామమాత్రంగా ఫాగింగ్..
పల్లెల్లో ఫాగింగ్యంత్రాలున్నా నిధులు లేక నిరుపయోగంగా మారాయి. అదే మున్సిపాలిటీల్లో ఫాగింగ్ యంత్రాలున్నా వాటిలో కొన్ని పనిచేయడం లేదు. జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలు ఉన్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో మూడు ఫాగింగ్ మెషీన్లు ఉండగా, రెండు పనిచేయడం లేదు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఒక మెషీన్ ఉండగా, ఉపయోగంలో లేదు. కొత్తకోట మున్సిపాలిటీలో కూడా ఫాగింగ్చేయడం లేదు.
పట్టణంలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నివారణ కోసం ప్రతి 15 రోజులకోసారి మందు పిచికారీ చేయాలి. కానీ అది జరగడం లేదు. ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
హాస్పిటల్స్లో పెరుగుతున్న ఓపీ..
జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీ రోజురోజుకూ పెరుగుతోంది. రోజూ 900 మందికి పైగా రోగులు వస్తున్నారు. వారిలో వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ ఓపీ రోగుల సంఖ్య పెరుగుతుంది. గత 45 రోజుల్లో వైరల్ ఫీవర్తో 7 వేల మంది బాధపడుతున్నారు. బ్లడ్ షాంపిల్స్ సేకరించి పరీక్షించగా, 42 మందికి డెంగ్యూ పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
గ్రామాల్లో అధ్వానంగా పారిశుధ్యం..
గ్రామాల్లో పారిశుధ్య పనులు అధ్వానంగా తరయారయ్యాయి. పారిశుధ్యం, మురుగు కాల్వలు, విద్యుద్దీపాల నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు ఉపయోగించే ఫాగింగ్మెషీన్ల వినియోగం భారంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.