
జీడిమెట్ల, వెలుగు: పెదనాన్న వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డలో అనురాధ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తుంది. ఆమె భర్త కొద్ది నెలల కింద చనిపోయారు. కాగా, అనురాధ ఇంటిని బావ శ్రీను సొంతం చేసుకునేందుకు తరచూ వెళ్లి గొడవపడేవాడు. అంతేకాకుండా ఓ ఫైనాన్స్సంస్థ వద్ద ఆమె భర్త అప్పు చేయడంతో తీర్చాలంటూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారు.
దీంతో అనురాధ పెద్ద కూతురు పింకి(17), తీవ్ర మనస్తాపానికి గురైంది. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మమ్మీ నన్ను క్షమించు’.. ‘ పెద నాన్న శ్రీను, అతని అమ్మ, నాన్నలే నా చావుకు కారణం, వారికి శిక్ష పడాలి’ అంటూ.. పింకి సూసైడ్‌నోట్ రాసింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.