సహజీవనం చేస్తున్న వ్యక్తికి .. ఆటో కోసం కొడుకును అమ్మిన తల్లి

సహజీవనం చేస్తున్న వ్యక్తికి .. ఆటో కోసం కొడుకును అమ్మిన తల్లి
  • ఐదుగురిపై కేసు నమోదు

లింగంపేట, వెలుగు : సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేండ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మింది. బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరో వ్యక్తికి అమ్మేసింది. ఈ విషయం చైల్డ్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్లకు, పోలీసులకు తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. లింగంపేట ప్రొబేషనరీ ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేండ్ల కింద నర్సింలు అనే వ్యక్తితో వివాహమైంది. పాప, బాబు పుట్టిన తర్వాత నర్సింలు చనిపోయాడు. లావణ్య ఓ దుస్తుల షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మరో వైపు లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన సాయిలు భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి కామారెడ్డిలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో లావణ్యకు సాయిలుతో పరిచయం ఏర్పడగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆటో కొనేందుకు బాలుడిని అమ్మేయాలని సాయిలు లావణ్యను కోరాడు. ఇందుకు ఒప్పుకున్న లావణ్య తన ఐదేండ్ల కుమారుడు నిఖిల్‌‌‌‌ను ఇటీవల పర్మల్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు అమ్మేసింది. నసీమా మెదక్‌‌‌‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలోని తన సోదరి షాహిదాకు అమ్మగా.. ఆమె ఆదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్‌‌‌‌ అనే వ్యక్తికి రూ. లక్షకు బాలుడిని విక్రయించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న చైల్డ్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడి తల్లి లావణ్యతో పాటు సాయిలు, నసీమా, షాహిదా, కుంచాల శేఖర్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.