అన్నపూర్ణలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో..

 అన్నపూర్ణలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో..

ఇండియన్‌‌ సినిమాకు సంబంధించి సాంకేతికత విషయంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకూ మోషన్ క్యాప్చర్‌‌‌‌ టెక్నాలజీతో తీసే సినిమాల కోసం మన ఫిల్మ్ మేకర్స్ ఇతర దేశాలపై ఆధారపడేవారు. ఇప్పుడు హైదరాబాద్‌‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా, హాలీవుడ్ సంస్థ యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ సహకారంతో ‘ఏ అండ్ ఎం’ మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌‌ను స్టార్ట్‌‌ చేశారు. తాజాగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ అత్యాధునిక సదుపాయాన్ని ఆవిష్కరించారు.

‘వారణాసి’ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఈ టెక్నాలజీతో ఇక్కడే చిత్రీకరించినట్లు రాజమౌళి ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఒకప్పుడు ఇలాంటి సాంకేతికత కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. బాహుబలి, ఈగ వంటి సినిమాల సమయానికే ఇది మనకు అందుబాటులో ఉంటే ఫలితం మరింత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరింది” అని రాజమౌళి అన్నారు.

భారతీయ దర్శకుల కలలను నిజం చేసేందుకే ఈ ల్యాబ్ ఏర్పాటు చేశామని, భారతీయ సినిమా ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నాగార్జున తెలిపారు. ఇక మహేష్ బాబు,  ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్‌‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.