
- ఆరు బృందాలతో గాలింపు
ముంబై: బీఎమ్‌డబ్ల్యూ కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన శివసేన నేత(షిండే వర్గం) రాజేశ్ షా కొడుకు మిహిర్ షా(24) ఇంకా పట్టుబడలేదని ముంబై పోలీసులు తెలిపారు. ఆరు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చెప్పారు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నందున మిహిర్ షాపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసినట్లు వివరించారు. ఓ బార్లో బాగా మద్యం తాగిన మిహిర్ షా.. డ్రైవర్ ను కాదని బీఎమ్‌డబ్ల్యూ కారును తనే డ్రైవ్ చేశాడని చెప్పారు.
మద్యం మత్తులో కారును వేగంగా నడిపి స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయని వివరించారు. ప్రమాదం తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు.. నంబర్ ప్లేట్, శివసేన స్టిక్కర్ తొలగించాడని తెలిపారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడన్నారు. బార్ బిల్లును, సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నామని తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే కారు యజమాని రాజేశ్ షాను, డ్రైవర్ రాజరిషి బిదావత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 105 సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తంచేసిన సీఎం ఏక్ నాథ్ షిండే.. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.