ఇండియాలో ఆ రెండు నగరాల ముస్లింల సపోర్ట్ మాకే: పాక్ మాజీ క్రికెటర్

ఇండియాలో ఆ రెండు నగరాల ముస్లింల సపోర్ట్ మాకే: పాక్ మాజీ క్రికెటర్

భారత్ లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం ఇటీవలే పాకిస్థాన్ టీం భారత్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ టీంకి హైదరాబాద్ లో ఘనమైన స్వాగతం లభించింది. దీంతో అప్పటినుంచి పాకిస్థాన్ ఆనందంలో తేలాడుతుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ముస్తాక్ అహ్మద్ తన చెత్త బుద్ధిని బయటపెట్టాడు. హిందూ- ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ లో ఒక రెండు నగరాల్లో ముస్లీమ్ ప్రజలు పాకిస్థాన్ కి సపోర్ట్ గా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ఈ సందర్భంగా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ " భారత్ లోని అహ్మదాబాద్‌, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ముస్లింలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లలో చాలామంది పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పాక్ టీమ్‌కి మంచి సపోర్ట్ దక్కడానికి కారణం అదే.  ఈ వరల్డ్ కప్ లో అహ్మదాబాద్ లో పాకిస్థాన్ కి మద్దతు దక్కుతుందని ఆశిస్తున్నా"అని పేర్కొన్నాడు. పాకిస్థాన్ వార్తా ఛానెల్ సమా టీవీ చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు ముస్తాక్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో రానా నవీధులు హసన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచాడు.భారత్ అంటే ఎప్పుడు ఈర్ష్య చెందే పాకిస్థాన్.. ఇలా అర్ధం లేని కామెంట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది. కాగా.. చివరిసారిగా 2012లో దాయాదుల మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నమెంట్స్ లో మాత్రమే తలపడుతున్నాయి. చివరిసారిగా 2016 లో టీ 20 వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటించిన పాక్ టీం..తాజాగా వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ కి వచ్చింది. ఇక ఇరు జట్ల మధ్య అక్టోబర్ 14న గుజరాత్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైట్  జరగనున్న సంగతి తెలిసిందే.