- ఎడమ కాల్వ ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో విడుదల
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ఆయకట్టులో యాసంగి (రబీ) సీజన్‌లో ఆరుతడి పంటల సాగు కోసం ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిలో సాగునీటి విడుదల చేయాలని ఎన్ఎస్పీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో ఆరుతడి పంటల సాగు కోసం డిసెంబర్ 7 ఆదివారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు వార బందీ విధానంలో మొత్తం ఏడు విడతల్లో నీటి విడుదల కోసం ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
మొత్తం 120 రోజుల పాటు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదటి విడతలో నెల రోజులపాటు నిరంతరాయంగా సాగు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మిగిలిన ఆరు విడతల్లో 9 రోజులపాటు నీటి విడుదల చేసి, ఆరు రోజులపాటు నిలిపివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడమకాల్వ కింద ఉన్న 3.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మొదటి విడతలో 27 రోజుల పాటు, సూర్యాపేట జిల్లాలో 30 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు. రైతులు యాసంగి సీజన్‌లో వరి పంట సాగు సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు.
నల్గొండ జిల్లాలో నీటి విడుదల తేదీలు..
మొదటి విడతలో డిసెంబర్ 7 నుంచి జనవరి 2 వరకు, రెండవ విడత జనవరి9 నుంచి 17 వరకు, మూడవ విడత జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు, నాలుగో విడత ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు, ఐదవ విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు, ఆరవ విడత మార్చి 10 వ తేదీ నుంచి 18 వరకు, ఏడవ విడత మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు నీటిని విడుదల చేస్తారు.
సూర్యాపేట జిల్లాలో ..
మొదటి విడత ఈ నెల 7 వ తేదీ నుంచి జనవరి 7 వరకు, రెండవ విడత జనవరి 14 నుంచి 22 వరకు, మూడవ విడత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు, నాల్గవ విడత: ఫిబ్రవరి 13 నుంచి 21 వరకు, ఐదవ విడత మార్చి 1 నుంచి 8 వరకు, ఆరవ విడత మార్చి 15 నుంచి 23 వరకు, ఏడవ విడత మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసిన నీటితో ఆరుతడి పంటలను సాగు చేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎన్ఎస్పీ అధికారులు రైతులకు సూచించారు.

