సర్టిఫికెట్లు అందించడంలో జాప్యం చేయొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

సర్టిఫికెట్లు అందించడంలో జాప్యం చేయొద్దు :  కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ, వెలుగు: తహసీల్దార్లు కుల, ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అవసరమైతే  ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆర్డీఓ, డీఈఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణీ పై వచ్చిన దరఖాస్తులు,  పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో, తహసీల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్ష నిర్వహించారు.

  పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. బిల్లులను వెంటనే చెల్లించాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌ కుమార్‌‌ను ఆదేశించారు. భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి పనులు పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రోగుల వివరాలను, సిబ్బంది, డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ తో పాటు, ఆసుపత్రిలో వైద్య సేవలు, పరికరాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ అధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ పద్మ, ఎంపీడీవో  వేదం రక్షిత, కనగల్ సర్పంచ్ మురళి గౌడ్ పాల్గొన్నారు.