ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి..షేజల్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్​డబ్ల్యూసీ

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి..షేజల్  ఫిర్యాదుపై  స్పందించిన ఎన్​డబ్ల్యూసీ
  • డీజీపీ, ఏడీజీకి జాతీయ మహిళా కమిషన్  నోటీసు
  • షేజల్  ఫిర్యాదుపై  స్పందించిన ఎన్​డబ్ల్యూసీ
  • 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • డీజీపీ, ఏడీజీకి జాతీయ మహిళా కమిషన్  నోటీసు
  • షేజల్  ఫిర్యాదుపై స్పందించిన ఎన్ డబ్ల్యూసీ
  • 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు షేజల్ ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్​(ఎన్ డబ్ల్యూసీ) స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఉమెన్  సేఫ్టీ ఏడీజీపీ షికా గోయల్ కు కమిషన్  నోటీసులు జారీ చేసింది. బాధితురాలు షేజల్ ఈ నోటీసులను మీడియాకు రిలీజ్ చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖకు ఈ నెల 5న కమిషన్ ఈ నోటీసులు ఇచ్చిందని ఆమె తెలిపారు. బాధితురాలు షేజల్  ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్, కంప్లైంట్  ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని పోలీస్ శాఖను కమిషన్  అడిగింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ దిశగా తీసుకొన్న చర్యలపై15 రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని షేజల్ కు కమిషన్  సూచించింది. జాతీయ మహిళా కమిషన్  అండగా ఉంటుందని షేజల్​కు భరోసా ఇచ్చింది. మీరు (షేజల్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చింది. బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో భద్రత కల్పిస్తామని తెలిపింది.

సీఎం కేసీఆర్​కు షేజల్  విజ్ఞప్తి.. వీడియో రిలీజ్

సీఎం కేసీఆర్ మంచి ర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై స్పందించాలని బాధితురాలు బోడపాటి షేజల్  డిమాండ్ చేశారు. విచారణ జరిపి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. గురువారం ఢిల్లీలో ఈ మేరకు ఆమె ఒక వీడియోను రిలీజ్  చేశారు. మంత్రి కేటీఆర్  అపాయింట్ మెంట్  కోసం చాలాసార్లు ప్రయత్నించినా.. ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్ డబ్ల్యూసీ) గురువారం తెలంగాణ పోలీసులకు నోటీసు పంపించిందని తెలిపారు. 15 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. అండగా నిలిచిన బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.