- వృద్ధులకు అండగా ఉంటామని హామీ..
- బాధలుంటే తమను సంప్రదించాలని సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలు అనాథలుగా వదిలేయడం బాధాకరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని, ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడాన్ని తాము ఒప్పుకోమన్నారు. ఈ విషయంలో ఎలాంటి సాకులు, సమర్థనలు ఆమోదయోగ్యం కావని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్చేశారు.
గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా తనను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఇదేనని పేర్కొన్నారు. నిత్యం ఎంతోమంది తల్లిదండ్రులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి తన దగ్గరకు వస్తుంటారని, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని, హింసకు పాల్పడడాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి వృద్ధుడికి, తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు’ అని ఆయన సూచించారు.
