నేపాల్ రూ.100 నోట్లపై భారత్ మ్యాప్.. మీరు ఏంట్రా ఇలా ఉన్నారు..!

నేపాల్ రూ.100 నోట్లపై భారత్ మ్యాప్.. మీరు ఏంట్రా ఇలా ఉన్నారు..!

నేపాల్ దేశం విడుదల చేసిన కొత్త రూ.100 కరెన్సీ నోటు భారతదేశానికి తీవ్ర కోపం తెప్పిస్తుంది. దీనికి కారణం ఈ నోటుపై ముద్రించిన నేపాల్ దేశ మ్యాప్. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ గురువారం ఈ కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటుపై ఉన్న నేపాల్ మ్యాప్‌లో భారతదేశ భూభాగంగాలో ఉన్న మూడు ప్రాంతాలు కాలాపానీ, లిపులేఖ్,  లింపియాధుర నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపిస్తుంది. ఈ ప్రాంతాలు భారత్-నేపాల్-చైనా సరిహద్దుల దగ్గర ఉన్నాయి.

ఈ కొత్త మ్యాప్‌ను ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మే 2020లో కూడా నేపాల్ మ్యాప్‌ను మార్చినప్పుడు ఇదొక కృత్రిమ విస్తరణ అని పేర్కొంటూ, దాన్ని ఆమోదించమని భారత్ హెచ్చరించింది. అలాగే భారతదేశం ఈ మూడు ప్రాంతాలు మావేనని పదేపదే చెబుతు వస్తుంది.
 
ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని అప్పటి నేపాల్ ప్రభుత్వం, మే 2020లో పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత దేశ మ్యాప్‌ను మార్చింది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ మా పాత రూ.100 నోటుపై కూడా ఈ మ్యాప్ ఉందని, అయితే 2020 ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇప్పుడు నోటు డిజైన్‌ను మార్చామని చెప్పారు. ఈ మ్యాప్ కేవలం రూ.100 నోటుపై మాత్రమే ఉంటుందని, రూ.10, 50, 500, 1,000 వంటి ఇతర నోట్లపై ఉండదని స్పష్టం చేశారు.

ఈ కొత్త నోటుపై మాజీ గవర్నర్ మహాప్రసాద్ అధికారి సంతకంతో పాటు  జారీ తేదీగా గ్రెగోరియన్ క్యాలెండర్‌లో 2024 సంవత్సరాన్ని సూచించే “2081 BS” ముద్రించింది. 

Also Read : ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ద్వారా విదేశాల్లో..భారీగా ఆస్తుల కొనుగోళ్లు


ఈ కొత్త రూ.100 నోటులో  ఎడమ వైపున మౌంట్ ఎవరెస్ట్ ఫోటో, కుడి వైపున నేపాల్ జాతీయ పుష్పం అయిన రోడోడెండ్రాన్ వాటర్‌మార్క్ మధ్యలో లేత ఆకుపచ్చ రంగులో  కొత్తగా మార్చిన నేపాల్ మ్యాప్, మ్యాప్ పక్కన అశోక స్తంభం గుర్తు, దానిపై "లుంబినీ - గౌతమ బుద్ధుని జన్మస్థలం" అని రాసి ఉంది. నోటు వెనుక ఒక కొమ్ము ఉన్న ఖడ్గమృగం ఫోటో ఉంది.

భారత్-నేపాల్  మధ్య సరిహద్దు పొడవు 1,850 కిలోమీటర్ల కంటే పైగానే ఉంటుంది. ఈ సరిహద్దు భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తాకి ఉంటుంది. 

కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర అనే ఈ మూడు ప్రాంతాలు భారత్, నేపాల్, చైనా సరిహద్దులు కలిసే (ట్రై-జంక్షన్) ప్రదేశానికి దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాంతాల విషయంలో ఇరు దేశాల మధ్య చాలా కాలంగా విభేదాలు  కొనసాగుతున్నాయి.