ఫేవరెట్‌‌‌‌ నిఖత్.. జనవరి 4 నుంచి నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్స్‌

ఫేవరెట్‌‌‌‌ నిఖత్.. జనవరి 4 నుంచి నేషనల్  బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్స్‌

గ్రేటర్ నోయిడా:  డబుల్ వరల్డ్ చాంపియన్, హైదరాబాదీ నిఖత్ జరీన్‌‌‌‌ సహా ఇండియా టాప్ బాక్సర్లంతా నేషనల్ సవాల్‌‌‌‌కు రెడీ అయ్యారు.  ఆదివారం మొదలయ్యే ఎలైట్‌‌‌‌ మెన్స్‌‌‌‌, విమెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తమ పంచ్‌‌‌‌ పవర్​ చూపెట్టనున్నారు.  ఇండియన్ బాక్సింగ్ చరిత్రలో తొలిసారిగా అమ్మాయిలు, అబ్బాయిల నేషనల్ చాంపియన్‌షిప్స్‌ ఒకేసారి, ఒకే వేదికపై నిర్వహిస్తున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో దేశం నలుమూలల నుంచి సుమారు 600 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 10 వెయిట్ కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీ డిసెంబర్ నెలాఖరులోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఢిల్లీ–ఎన్సీఆర్‌‌‌‌‌‌‌‌  ప్రాంతంలో పెరిగిన కాలుష్య నియంత్రణ చర్యల కారణంగా వాయిదా వేశారు.

ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో నిఖత్‌‌‌‌ తన వెయిట్‌‌‌‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ ఫేవరెట్‌‌‌‌గా ఉండగా.. వరల్డ్ చాంపియన్ మీనాక్షి, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్‌‌‌‌, పూజా రాణి, నీతూ వంటి టాప్‌‌‌‌ బాక్సర్లు కూడా బరిలో నిలిచారు. మెన్స్‌‌‌‌లో హితేష్‌‌‌‌, సచిన్‌‌‌‌, అభినాష్ జమ్వాల్‌‌‌‌, అమిత్ పంగల్ వంటి స్టార్లు పోటీలో ఉన్నారు. వచ్చే ఆసియా గేమ్స్‌‌‌‌, కామన్వెల్త్ గేమ్స్ కోసం నేషనల్ టీమ్ సెలెక్షన్‌‌‌‌కు ఈ పోటీలు కీలక వేదిక కానున్నాయి. ఈ టోర్నీలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ నెగ్గిన బాక్సర్లకు నేషనల్ క్యాంప్‌‌‌‌లో నేరుగా చోటు లభిస్తుంది.