పల్లె, పట్నాలకు వచ్చే.. నిధుల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి : నరేంద్ర

పల్లె, పట్నాలకు వచ్చే.. నిధుల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి : నరేంద్ర
  • ఆడిటర్లకు ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్ర సూచన 

హైదరాబాద్, వెలుగు: పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వచ్చే నిధులు పక్కదారి పట్టకుండా, ఖర్చులో పూర్తి పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్‌‌‌‌‌‌‌‌)లో సోమవారం వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే నిధుల ఖర్చులో జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఐటీ, ఏఐ, శాటిలైట్ టెక్నాలజీలను వినియోగించి ఆడిటింగ్ సవాళ్లను అధిగమించాలని సూచించారు.డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (స్థానిక సంస్థల ఆడిట్) మనీశ్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఆడిట్ కేవలం లెక్కలు చూడటం మాత్రమే కాదని, అది రాజ్యాంగపరమైన బాధ్యత అని పేర్కొన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారదర్శకత పెంచేందుకు లోకల్ ఫండ్ ఆడిట్ ఒక వజ్రాయుధం లాంటిదని వివరించారు.