- గ్రామంలో 144 సెక్షన్ తో కర్ఫ్యూ వాతావరణం
- వీడీసీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా జడ్జి
- కొంతకాలం తర్వాత మళ్లీ మొదలైన వీడీసీల దురాగతాలు
- బాల్కొండ సెగ్మెంట్లో నెలకొన్న దారుణ పరిస్థితులు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు ఆగడంలేదు. ఆదేశాలు ధిక్కరించిన ప్రజలపై బహిష్కరణ వేటు వేయడం ఆపడం లేదు. వీడీసీల ఆగడాలను కట్టడి చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపినా భయపడట్లేదు. మరింతగా తమ ఆధిపత్యాన్ని చూపుతూ రెచ్చిపోతున్నాయి. జిల్లాలోని బాల్కొండ సెగ్మెంట్ ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో నెల నుంచి ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా రెండు రోజుల్లో ఉద్రిక్తత నెలకొంది.
తమపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపారనే అక్కసుతో వీడీసీ సభ్యులు సోమవారం ఈత చెట్లను నరికేయడంతో మరోసారి టెన్షన్ వాతారణం నెలకొంది. ఘటనపై బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగానే సహనం కోల్పోయిన బాధిత గీత కార్మికులు పదిమంది వీడీసీ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలతో పాటు 60 మంది సిబ్బందితో బందోబస్తు కొనసాగిస్తున్నారు. బుధవారం గ్రామంలోకి బయటి వ్యక్తులకు రానివ్వలేదు. గ్రామస్తులను ఇండ్లలోంచి బయటకు వెళ్లనీయలేదు. 144 సెక్షన్ విధించారు.
ఇదీ నేపథ్యం..
ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో 29 గౌడ కుటుంబా లు నివసిస్తుండగా.. ఇందులో సగం కుటుంబాలు ఈత చెట్లకు కల్లు తీస్తాయి. ప్రతి ఏడాది వీడీసీకి పన్ను కడుతున్నాయి. ఇకముందు కల్లు వ్యాపారాన్ని తమకు బదలాయించాలని గతేడాది వీడీసీ సభ్యులు ఆదేశించారు. ఇందుకు గీత కార్మికులు ఒప్పుకోకపోవడంతో రూ.5 లక్షల జరిమానా విధించారు. కట్టేందుకు ససేమిరా అనడంతో గ్రామస్తులు కల్లు తాగొద్దని ఆదేశించా రు.
తమ ఆదేశాన్ని ధిక్కరించిన ఇద్దరికి రూ.40 వేల జరిమానా వేశారు.ఆపై 29 మంది గౌడ కుటుంబాలను బహిష్కరించారు. అదేవిధంగా గత ఏప్రిల్‌లో శ్రీరామనవమి రోజు గౌడ కులానికి చెందిన మహిళలను ఆలయంలో సంప్రదాయ పూజలకు అనుమతించలేదు. దీంతో జిల్లాలోని గౌడ సంఘాలు భారీ ర్యాలీగా వెళ్లి సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశాయి. నలుగురు వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేశారు.
ఈత చెట్ల నరికివేతతో మళ్లీ ఉద్రిక్తత
బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్ల పరిధిలో ప్రజలను సంఘ బహిష్కరణ, శిక్షలు విధించిన సుమారు వంద మంది వీడీసీ సభ్యులపై గత నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగనెవార్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుత సీపీ సాయిచైతన్య అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తులను బహిష్కరించిన నలుగురు వీడీసీ సభ్యులపై కేసులు పెట్టారు. వీడీసీలు పద్ధతి మార్చుకోకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆపై కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా గత జులై 26న గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయించి జడ్జి భరతలక్ష్మిని ఆహ్వానించారు. మోర్తాడ్, ఎర్గట్ల మండలాల వీడీసీల మీటింగ్ లో తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీని రద్దు చేస్తున్నట్లు, ప్రజలతో సామరస్యంగా ఉంటామని వీడీసీ పెద్దలు నమ్మించారు. అప్పటి నుంచి గీత కార్మికులు ఎవరిపనివారు చేసుకుంటున్నారు. మళ్లీ వీడీసీ సభ్యులు ఈత చెట్లను నరికివేశా రు. దీంతో గీతకార్మికుల దాడితో ఉద్రిత్తక నెలకొంది. నిజామాబాద్‌తో పాటు ఇరుగుపొరుగు జిల్లాల గౌడ సంఘాలు ఈనెల19న ఛలో తాళ్లరాంపూర్ పిలునివ్వడం ఆందోళన కలిగిస్తోంది.
మరికొన్ని నాలుగు గ్రామాల్లో..
ముప్కాల్ మండలం కొత్తపల్లిలో కూడా వీడీసీల ఆగడాలు మితిమీరిపోయా యి. కల్లు గీత కార్మికులు చెట్లవద్దకు వెళ్లే బాటను బంద్ చేసి బహిష్కరించారు. వారికి గ్రామస్తులు ఎలాంటి సహకారం అందించొద్దని చేసిన ప్రకటన ఏడాదిగా అమలులో ఉంది. వెంచిర్యాలలో ఆదేశాలు ధిక్కరించిన ప్రజలపై రూ.5 లక్షల జరిమానా విధించారు.
నాగంపేటలో ఐదెకరాల ల్యాండ్ భూమి విషయంలో తమ ఆదేశాలు పట్టించుకోలేదని ప్రజలను బహిష్కరించారు. మెండోరా మండ లం బుస్సాపూర్‌లో ఇద్దరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఎకరన్నర అసైన్డ్ మెంట్ల్యాండ్లోకి వెళ్లనీయకుండా పదేండ్లుగా ఆదేశిస్తున్నారు.
