
- ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
- ఒక్క వెహికల్కు పూర్తి కాని ప్రక్రియ
- జిల్లాలో 2 లక్షల ఓల్డ్ వెహికల్స్
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో 1 ఏప్రిల్ 2016కు ముందు కొనుగోలు చేసిన సుమారు రెండు లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చే ప్రక్రియ సర్వర్ సమస్యలతో ఆగిపోయింది. ఈనెలాఖరుతో గడువు ముగియనుండగా ఒక్క వాహనానికీ నెంబర్ ప్లేట్ కూడా జారీ కాకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019 తరువాత కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే ఆన్‌లైన్‌లో వివరాలు ఉండటంతో పాత వాహనాల డేటా అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
అప్‌లోడ్ చేయకపోవడం కారణం
1 ఏప్రిల్ 2019 నుంచి దేశంలో హెచ్‌ఎస్‌ఆర్‌పీ (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్) విధానం వాహనాల చోరీ నివారణ, లీగల్ సపోర్ట్ కోసం ఉపయోగపడుతోంది. 1 ఏప్రిల్ 2016కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు 30 సెప్టెంబర్ వరకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, పాత వాహనాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదు. ఈ సమస్యతో వాహన యజమానులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 4.70 లక్షల వెహికల్స్
జిల్లాలో 4.70 లక్షల వాహనాలు ఉన్నాయి, వీటిలో 3,90,126 టూవీలర్స్, 47,122 కార్లు, ఇతర ఫోర్ వీలర్ బండ్లు, 31 వేల ఆటో రిక్షాలు, 5 వేల లారీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 50 వేల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2019 తర్వాత కొనుగోలు చేసిన వాహనాల వివరాలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్పోర్ట్ అధికారులకు అందుబాటులో ఉన్నప్పటికీ, 1 ఏప్రిల్ 2016కు ముందు కొనుగోలు చేసిన సుమారు 2 లక్షల వాహనాల వివరాలు అందుబాటులో లేనందువల్ల హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్లు ఇంకా ఇవ్వలేదు.
వాహన రకానికి అనుగుణంగా రూ.350 నుంచి రూ.8,000 వరకు ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. సదరు వాహనాలకు గడువు సమీపిస్తుండడంతో అధికారులు పనులను వేగవంతం చేశారు.
ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం
2019కు ముందు కొనుగోలు చేసిన వాహనాల వివరాలు ఆన్‌లైన్‌లో లేనందున హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్లు అమర్చలేదు. గడువు ముగిసిన తర్వాత ఏవీహెచ్‌సీ వాహనాలపై ఫెనాల్టీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. తదుపరి కూడా ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. - ఉమామహేశ్వర్ రావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్