
- మరో 11 చోట్ల కొత్త సబ్స్టేషన్లు
- సరఫరా లోపాలు పసిగట్టేందుకు ఎఫ్‌పీఐ ఇండికేటర్లు
- యాసంగి నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కరెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఇండోర్ సబ్ స్టేషన్ నిజామాబాద్ సిటీలో నిర్మితమవుతోంది. కొత్తగా మరో 11 చోట్ల 33/11 సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు ముగిసిన తర్వాత మిగిలిన తొమ్మిది సబ్ స్టేషన్ల పనులు ప్రారంభిస్తారు. పవర్ సప్లై లోపాలను సాంకేతికంగా పసిగట్టి సరిదిద్దడానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ (ఎఫ్‌పీఐ)ను ఉపయోగిస్తారు.
కరెంట్ పోల్స్ లేని ఇండోర్ సిస్టం..
జిల్లాలో 8,21,116 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ బోర్ కనెక్షన్లు 1.88 లక్షలు, ఇండ్లకు 5.33 లక్షలు ఉండగా మిగతా కనెక్షన్లు ఇండస్ట్రీస్, కమర్షియల్ ఉన్నాయి. సబ్ స్టేషన్ల ద్వారా కరెంట్ సరఫరా చేసే పాత పద్ధతికి ఫుల్‌స్టాప్ పెట్టి, నిజామాబాద్ నగరంలో రూ.6.30 కోట్లతో ఇండోర్ (భూగర్భ విద్యుత్) పవర్ స్టేషన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీలకు మాత్రమే ఇండోర్ సిస్టం ఉంది.
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. పులాంగ్‌లోని రైతు బజార్ లో వెయ్యి గజాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తైన తర్వాత ఎక్కడా కరెంట్ పోల్స్ లేకుండా, అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా సిటీకి పవర్ సప్లై అందించనున్నారు. గాలి, వాన వచ్చినా కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడదు. ఈ ఆధునిక సిస్టం ద్వారా సిటీకి క్వాలిటీ విద్యుత్ సరఫరా కానుంది.
వేగంగా రిపేర్ల కోసం ఎఫ్‌పీఐ..
ఏదైనా కారణంతో విద్యుత్ పోతే దానిని గుర్తించడానికి చాలా సమయం పట్టేది. జిల్లా పరిధిలో 976 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 8,518 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 45,486 ట్రాన్స్ఫార్మర్స్, వేల ఫీడర్లలో సమస్య వెతకడానికి ఇబ్బందులు ఏర్పడేవి. ఇప్పుడు ఈ సమస్యను వేగంగా గుర్తించడానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ (ఎఫ్‌పీఐ) పరికరాలు అమరుస్తున్నారు. మొత్తం లైన్‌ను చెక్ చేయలేకపోయినా, సమస్యలను తెలియజేసే ఎఫ్‌పీఐలను ఓవర్‌లోడ్ ఏరియాల్లో ఫిక్స్ చేస్తున్నారు. దీంతో సమస్యలు వచ్చిన వెంటనే వేగంగా గుర్తించి రిపేర్లు చేయవచ్చు.
రూ.3 కోట్లతో 11 సబ్ స్టేషన్ల నిర్మాణం
జిల్లాలో 216 విద్యుత్ సబ్ స్టేషన్లు (33/11 కేవీ) ఉన్నాయి. పెరుగుతున్న వ్యవసాయ కనెక్షన్స్, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, ఇండ్లు, పరిశ్రమల కారణంగా సబ్ స్టేషన్లలో ఓవర్ లోడ్ సమస్య ఏర్పడుతోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాను ఇంజినీర్లు అందించలేని పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేయగా, ధర్పల్లి మండలం డీబీ తండా, కోటగిరి మండలం ఎత్తొండలో పనులు ప్రారంభించారు. న్యాల్‌కల్ రోడ్డు, న్యాల్‌కల్ విలేజ్, తిర్మన్‌పల్లి, తాటిపల్లి, రాహత్‌నగర్, వాడి, ఆచన్‌పల్లి, జాడి, హనుమాన్ ఫారం గ్రామాల్లో భూసేకరణ, టెండర్లు ముగిశాయి. వర్షాలు ముగిసిన వెంటనే మిగిలిన పనులు ప్రారంభం కానున్నాయి.
సర్కార్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నాం..
క్వాలిటీ విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం గేమ్ చేంజర్ అవుతుంది. ఈ యాసంగి సీజన్‌లో స్పష్టమైన మార్పులు వస్తాయి. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రవీందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్