వేర్వేరు భాషల్లో సినిమాలు రావడం సంతోషం

వేర్వేరు భాషల్లో సినిమాలు రావడం సంతోషం

ఢిల్లీ, వెలుగు: సినిమాల్లో హింస, వల్గారిటీ వంటివి చూపించడాన్ని తగ్గించాలని దర్శక, నిర్మాతలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీనపరిచేలా సినిమాలు ఉండొద్దన్నారు. నైతికత, సామరస్యం, ప్రజల్లో బాధ్యతను పెంచేలా సినిమాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 67వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అత్యుత్తమ సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ రజినీకాంత్​కు అందించారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని ఉత్తమ సినిమాలు, నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు.

వేర్వేరు భాషల్లో సినిమాలు రావడం సంతోషం

సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని వెంకయ్య అన్నారు. ఈ ప్రభావాన్ని సానుకూలంగా మార్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. జపాన్, ఈజిప్టు, చైనా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాల్లో ఇండియా సినిమాలకు ఎంతో ఆదరణ ఉందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్న టైమ్​లో మన విలువలు, సంప్రదాయాలను సినిమా వేదిక ద్వారా విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి జరగాలని చెప్పారు. ‘వేర్వేరు భారతీయ భాషల్లో సినిమాలు రావడం సంతోషకరం. అయితే సినిమాకంటూ ప్రత్యేకమైన భాష ఉంటుంది. అది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది’ అన్నారు.

అభిమానుల గుండెల్లో రజినీ

ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల హృదయాల్లో రజినీకాంత్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ఉపరాష్ట్రపతి పొగిడారు. ఈ సందర్భంగా రజినీ నటించిన కొన్ని సినిమాల పేర్లను ప్రస్తావించారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటున్న యువతరానికి రజినీ జీవితం ఇన్స్​పిరేషన్ గా నిలుస్తుందన్నారు. ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్ పాయ్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతికి అవార్డులు అందించారు. సినీ నిర్మాణానికి అత్యంత అనుకూల రాష్ట్రంగా సిక్కింకు అవార్డును ప్రదానం చేశారు.  కాగా, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడంపై తన ఆనందాన్ని సోషల్ మీడియా ట్విట్టర్, హూట్ వేదికగా రజినీకాంత్​ పంచుకున్నారు. ‘ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నా గురువు బాలచందర్, సోదరుడు సత్యనారాయణ కేజ్రీవాల్, స్నేహితుడు రాజ్ బహదూర్, నిర్మాతలు, అభిమానులు, నన్ను ఆదరించే తమిళ ప్రజలకు అంకింతం’ అని పోస్టు చేశారు.