గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ.. సీఎస్, డీజీపీకి నోటీసులు

గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ.. సీఎస్, డీజీపీకి నోటీసులు

హైదరాబాద్, వెలుగు:  గిరిజన మహిళ లక్ష్మిని అదుపులోకి తీసుకున్న చోటు నుంచి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని వెంటనే అందజేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. బాధ్యులు శిక్షార్హులు అని కామెంట్లు చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు రెండు వారాల తర్వాత జరిగే విచారణలోగా అందజేయాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం ఆదేశించింది. 

పేపర్లలో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిల్​గా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్​ కమిషనర్, రాచకొండ డీసీపీ, ఎల్బీ నగర్‌‌ ఏసీపీ, ఎస్​హెచ్​వోలకు నోటీసులు జారీ చేసింది. గిరిజన మహిళపై ఈ నెల 15న జరిగిన దాడి గురించి పత్రికల్లో వచ్చిన వార్తలను చదివిన జస్టిస్‌‌ సూరేపల్లి నంద.. చీఫ్‌‌ జస్టిస్‌‌కు లేఖ రాశారు. దీంతో సుమోటో గా పరిగణించి విచారణ చేపట్టారు.