రూపే క్రెడిట్​ కార్డులపై  ఎన్​పీసీఐ ఫోకస్

రూపే క్రెడిట్​ కార్డులపై  ఎన్​పీసీఐ ఫోకస్

న్యూఢిల్లీ: రూపే క్రెడిట్​ కార్డులను మరింతగా పెంచడంపై నేషనల్​పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ) ఫోకస్​ పెడుతోంది. ఈ రంగంలోకి ఎన్​పీసీఐ కొత్తగా అడుగు పెట్టింది. కొత్తగా జారీ అవుతున్న కార్డులలో తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కిందటి ఏడాదిన్నర కాలంలో కొత్తగా జారీ అయిన క్రెడిట్​ కార్డులలో 12 నుంచి 15 శాతం దాకా రూపే క్రెడిట్​ కార్డులున్నాయని ఎన్​పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్​ చెప్పారు. రూపే గేట్​వే ద్వారా రిటెయిల్​ పేమెంట్లు, సెటిల్​మెంట్లు జరిపేందుకు ఆర్​బీఐ చొరవతో ఇండియన్​ బ్యాంక్స్​అసోసియేషన్​ (ఐబీఏ) ఎన్​పీసీఐని  ఏర్పాటు చేసింది. డెబిట్​ కార్డు, ప్రీపెయిడ్​ కార్డు సెగ్మెంట్లలో మంచి పట్టు సాధించామని, ఇప్పుడు క్రెడిట్​ కార్డు సెగ్మెంట్​పై ఫోకస్​ పెడుతున్నామని సీఓఓ వెల్లడించారు. రెండేళ్లుగా దేశంలోని క్రెడిట్ కార్డుల మార్కెట్లో జోరు పెరిగిందని రాయ్​ చెబుతూ, అంతకు ముందు ఏడాదికి 4 కోట్ల కార్డులు జారీ అయ్యేవని, ఇటీవల అది ఆరున్నర కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మన దేశపు స్కీము కావడంతో చాలా మంది కస్టమర్లు రూపే కార్డులు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టోకెనైజేషన్​ బేస్డ్​ డిజిటల్​ ట్రాన్సాక్షన్ల కోసం ఒక మోడల్​ను డెవలప్​ చేస్తున్నట్లు రాయ్​ వెల్లడించారు.