Jr NTR : ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్.. 'గాడ్ ఆఫ్ వార్'.. 'రామాయణం' కంటే ఘనంగా..!

Jr NTR  :  ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ  అప్‌డేట్..  'గాడ్ ఆఫ్ వార్'..  'రామాయణం' కంటే ఘనంగా..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ ( Trivikram ) , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR )  కాంబినేషన్ లో రాబోయే చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు, నటీనటులు ఎవరెవరు ఉండబోతున్నారు అన్న దానిపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  ఈ కాంబినేషన్‌పై  ప్రముఖ నిర్మాత నాగవంశీ ( Naga Vamsi ) చేసిన వ్యాఖ్యలు వారిలో అంచనాలను మరింత పెంచాయి

 ప్రస్తుతం విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కింగ్‌డమ్' ( Kingdom ) ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాగవంశీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్- -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న ఓ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని వెల్లడించారు. ఇది కేవలం ఒక సినిమా కాదని, తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని స్పష్టం చేశారు.

రామాయణం' కంటే ఘనంగా .. 
ఈ ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారని వంశీ తెలిపారు.  రామాయణం గ్లింప్స్ చూసిన త్రివిక్రమ్.. మనది దీనికంటే గొప్పగా చేద్దామని  చెప్పినట్లు ఆయన వెల్లడించారు. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' ( Ramayana ) చిత్రం ప్రస్తుత సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.  ఈ మూవీ కోసం  ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2026 రెండవ భాగంలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు.  ఇలాంటి భారీ ప్రాజెక్టులకు సాధారణంగా సుదీర్ఘ ప్రీ-ప్రొడక్షన్ సమయం అవసరం అవుతుంది. కనుక2026 చివరి నాటికి షూటింగ్ ప్రారంభమైతే, సినిమా విడుదల 2027 చివరి భాగంలోనో లేదా 2028 ప్రథమార్థంలోనో ఉండే అవకాశం ఉంది.

 ఎన్టీఆర్ వారసత్వం!
నందమూరి తారక రామారావు  తెలుగు ప్రజల హృదయాల్లో దైవ సమానుడిగా కొలువబడ్డారు.  ఆయన పౌరాణిక చిత్రాల్లో పోషించిన పాత్రలు అజరామరం.  ఎన్టీఆర్ వారసత్వం నుంచి వస్తున్న నాకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆయన మొదటిసారి దైవ పాత్ర పోషిస్తున్నందున  ఈ ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెడుతున్నామని వంశీ  చెప్పారు. ఇది కేవలం ఒక సినిమా కాదని, తరతరాలకు గుర్తుండిపోయే ఒక దృశ్య కావ్యంగా నిలవాలని చిత్ర బృందం కృషి చేస్తోందని వెల్లడించారు. 

ALSO READ : Dheeraj Kumar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు, నిర్మాత కన్నుమూత

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  ఇటీవల తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'వార్ 2' ( War 2 )  షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.