
రాష్ట్రంలో సుమారు వెయ్యి కేసులు
ఈఎన్టీకి గురువారం 284 మంది పేషెంట్లు
హాస్పిటల్‌లో సౌలతుల్లేక రోగులు ఇబ్బందులు
అన్ని టెస్టులకూ బయటకే పంపుతున్న డాక్టర్లు
ఆర్టీపీసీఆర్ టెస్టు ఉంటేనే అడ్మిషన్
హైదరాబాద్, వెలుగు: బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం హెల్త్ డిపార్ట్మెంట్కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి, పోసకోనజోల్, ఐసవుకోనజోల్ డ్రగ్స్ కోసం సర్కారు ఈ మెయిల్ (ent-mcrm@telangana.gov.in) కు గురువారం ఒక్క రోజే 7 వందల వినతులు వచ్చాయి. కానీ సర్కారు దగ్గర 3 వందల ఇంజక్షన్లే ఉన్నట్టు తెలిసింది. దీంతో ఏంచేయాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. మెయిల్ ద్వారా దరఖాస్తు చేసినా ఎవరూ స్పందించట్లేదని, బాధితులు నేరుగా కోఠిలోని డీఎంఈ ఆఫీసుకు వస్తున్నారు. ఆదుకోవాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి ఇప్పటికే వెయ్యి మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌కు గురువారం ఒక్కరోజే 284 మంది అనుమానితులు వచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లకూ బాధితులు క్యూ కడుతున్నారు.
బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌ను నోడల్ సెంటర్‌గా ప్రకటించిన సర్కారు అక్కడికి వచ్చే రోగుల బాగోగులను పట్టించుకోవట్లేదు. ఫంగస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు సీటీ స్కాన్ సహా డాక్టర్లు రకరకాల టెస్టులు రాయగా అవేవీ ఆ హాస్పిటల్‌లో లేవు. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి టెస్టులు చేయించుకోరావాలని చెబుతుండటంతో బాధితులు ముక్కుతూ, మూలుగుతూ ప్రైవేట్ బాట పడుతున్నారు. ఈ టెస్టులకు ప్రైవేట్‌లో రూ. 10 వేల నుంచి 15 వేల ఖర్చు అవుతోంది. ఒక్క సీటీ స్కాన్‌కే రూ.5 వేల నుంచి 8 వేలు వసూలు చేస్తున్నారు. ఇవిగాక మందులకు అదనంగా ఖర్చు అవుతోంది. ఈఎన్టీ హాస్పిటల్‌లో పొద్దున 8 గంటల నుంచి పదకొండున్నర వరకే ఫార్మసీ కౌంటర్ ఓపెన్ చేస్తున్నారు. తర్వాత మందులు అవసరమైతే ఇన్ పేషెంటైనా బయటకు వెళ్లి ప్రైవేటులో తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈఎన్టీలో బ్లాక్ ఫంగస్ ఇన్‌పేషెంట్ల సంఖ్య 90 దాటగా గాంధీలో ప్రస్తుతం 30 మందికిపైగా ఉన్నట్టు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.
రోడ్ల మీదే నిద్ర
ఈఎన్టీలో ఓపీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోమంటున్నారు. నెగెటివ్ వస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. అదే దవాఖానలో ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ కలెక్ట్ చేసే అవకాశమున్నా టెస్టుకూ బయటకే పంపిస్తున్నారు. టెస్టు రిజల్ట్ రావడానికి 24 గంటలు పడుతుండటంతో రోగం మరింత ముదురుతోంది. మరోవైపు జిల్లాల నుంచి వచ్చిన పేద రోగులకు రిజల్ట్ వచ్చేదాకా ఏడికి పోవాల్నో, ఏడ ఉండాల్నో తెల్వక దవాఖానా ముందు రోడ్డు మీదే పడుకుంటున్నారు.
బ్లాక్ ఫంగస్ పేషెంట్లను చూసేందుకు ఆయుష్ డాక్టర్లకు ఓకే
ఎపిడమిక్ యాక్ట్ కింద బ్లాక్ ఫంగస్ డిసీజ్‌ను గుర్తిస్తూ (నోటిఫయెబుల్) ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. స్ర్కీనింగ్, డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్‌కు సంబంధించి సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను ఫాలో కావాలని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. హాస్పిటళ్లలో చేరుతున్న పేషెంట్ల పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ పంపించాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సర్వెలైన్స్ డిసీజ్ ప్రోగ్రామ్ మెయిల్ (idsp@telangana.gov.in)కు వివరాలను పంపించాలన్నారు. అలాగే గాంధీ, ఈఎన్టీలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బ్లాక్ ఫంగస్ పేషెంట్లను పరిశీలించేందుకు ఆయుష్ డాక్టర్లకు పర్మిషన్ ఇస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గాంధీలో 23 కేసులు..30 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
పద్మారావునగర్, వెలుగు: కరోనా నోడల్ కేంద్రం గాంధీ ఆస్పత్రిలో గురువారం నాటికి మొత్తం 23 బ్లాక్ ఫంగస్ కేసులున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రాజారావు తెలిపారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం గాంధీలో 30 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఫంగస్ బాధితులకు ఆపరేషన్లు చేసేందుకు ఆరుగురు సభ్యుల వైద్య నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, వీరికి మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గాంధీలో గురువారం సాయంత్రం వరకు మొత్తం 1,262 మంది కరోనా పేషెంట్లు ఐసీయూ, ఆక్సిజన్ వార్డుల్లో ట్రీట్మెంట్పొందుతున్నారని కరోనా నోడల్ అధికారి టి. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం 91 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారన్నారు.
బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతి
మొగుళ్లపల్లి/కోదాడ, వెలుగు: బ్లాక్‌ఫంగస్‌తో సూర్యాపేట, వరంగల్‌లో ఒక్కొక్కరు మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన రేణికుంట్ల వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఉంటున్న సుదర్శన్‌కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయినఅతడికి రెండు రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకి పరిస్థితి విషమించింది. ఓ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం చనిపోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రంగారావు (55) ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. 3 రోజుల క్రితం బ్లాక్ ఫంగస్‌తో సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌లో చేరాడు. బుధవారం రాత్రి మృతి చెందాడు.
రెండ్రోజుల నుంచి తిరుగుతున్నం
మా నాన్నను బుధవారం మధ్యాహ్నం కోఠి ఈఎన్టీకి తీసుకొచ్చాం. ఓపీ పదకొండున్నరకే అయిపోయిందని, రేపు రావాలని చెప్పారు. నాలుగైదుసార్లు బతిమిలాడితే ఓ డాక్టర్ సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్, హెచ్‌ఐవీ, రకరకాల బ్లడ్ టెస్టులు రాశారు. ఆ రిపోర్టులు తెస్తే అడ్మిట్ చేసుకుంటామన్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ ల్యాబ్‌లో రూ.12 వేలు పెట్టి టెస్టులన్నీ చేపించినం. రాత్రి తెలిసినోళ్ల ఇంటికి పోయినం. గురువారం మధ్యాహ్నానికి రిపోర్టులు వస్తే చూసి అడ్మిట్ చేసుకున్నారు. మళ్లీ ఈసీటీ, 2డీ ఎకో, ఎంఆర్‌ఐ, హెచ్‌బీఎస్ టెస్టులు రాశారు. ఇవన్నీ బయట చేయించుకుని రమ్మన్నారు. మళ్లీ నాన్నను తీసుకుని రెండు, మూడు ల్యాబులు తిరిగినం. అన్ని చోట్లా ‘క్యూ ఉంది, రేపు రండి’ అని చెప్పారు. చేసేదేం లేక మళ్లీ హాస్పిటల్‌కు వచ్చినం. శుక్రవారం టెస్టులు చేయించాలి. - జే.నవీన్, చందనపల్లి విలేజ్, నల్గొండ జిల్లా