
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బండ్ల గూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో హోటల్స్, టిఫిన్ సెంటర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే.. కేవలం లాభార్జనే ధ్యేయంగా పరిశుభ్రతను హోటల్ యాజమాన్యాలు పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోర్టులో కొత్తగా అజంతా కేఫ్ అనే టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కిచెన్ రూమ్ ఎంత అధ్వానంగా ఉందంటే.. కంపు కొడుతోంది.
హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు అనే వ్యక్తి టిఫిన్ తీసుకునేందుకు అజంతా కేఫ్ హోటల్కు వెళ్లాడు. కేఫ్లో టిఫిన్ తీసుకోగా.. అందులో బొద్దింక కనిపించడంతో విస్మయం వ్యక్తం చేశాడు. ఇదేంటని హోటల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. మార్చి ఇస్తాంలే అని దురుసుగా, నిర్లక్ష్యంగా సమాధానమొచ్చింది. దీంతో.. మున్సిపల్ అధికారులకు ఈ ఘటనపై నర్సింగ్ రావు ఫిర్యాదు చేశాడు. బండ్లగూడ మున్సిపల్ అధికారులు పదివేల రూపాయలు జరిమానా విధించి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీలోని కొన్ని హోటళ్లలో ఏ కిచెన్ చూసినా గోడలు, కిచెన్ గట్లు నల్లగా జిడ్డుపట్టి కనిపిస్తున్నాయి. నాణ్యత లేని వంట సరుకులు, గడువు తీరిన మసాలాలు, సామగ్రి, రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసం, ఆహార పదార్థాలు, ఆహారంలో వాడకూడని రంగులు, అక్కడే తిరుగుతున్న ఎలుకలు, బల్లులు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చే కల్తీ ఆయిల్ వంటల్లో వినియోగిస్తున్నారు. కనీసం హైజనిక్ ఉండడం లేదు. కిచెన్ పరిసరాలు చూస్తేనే వాంతికి వచ్చేలా ఉంటున్నాయి.