
- రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే కేంద్రం దిగొస్తది: కవిత
- కుమారుడు ఆదిత్యతో కలిసి బీసీ బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మైనారిటీలో ఉందని, రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందన్నారు. బీసీ బంద్‌లో భాగంగా శనివారం హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో యునైటెడ్పూలే ఫ్రంట్నిర్వహించిన కార్యక్రమంలో తన కుమారుడు ఆదిత్యతో కలిసి కవిత పాల్గొన్నారు. ఆటోలతో ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపడతామన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మోసానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లులు ఆమోదించని బీజేపీ.. బంద్‌కు మద్దతు తెలపడమంటే హంతకులే నివాళులు అర్పించినట్టుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకునైనా సరే సాధించాలని డిమాండ్ చేశారు. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎక్కువ మంది యువతకు అవకాశాలు వస్తాయని కవిత కుమారుడు ఆదిత్య అన్నారు.
నా కొడుకు ఇంకా చిన్నోడు..
సామాజిక బాధ్యత నేర్పేందుకే తన కొడుకును బీసీ బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి టీచర్స్ఫెడరేషన్ఆవిర్భావ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘నా కుమారుడి వయసు చిన్నదే. ఇప్పుడే రాజకీయ అరంగేట్రమేమీ లేదు’’ అని కవిత చెప్పారు.