ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతుండటం, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ వంటి స్కామ్‌ల నుండి ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు గొప్ప మార్గాలను పరిశీలిస్తోంది. అదే కిల్ స్విచ్ అండ్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్.
'కిల్ స్విచ్' అంటే ఏంటి :
మనం బైక్ ఆపడానికి 'ఇంజిన్ కిల్ స్విచ్' ఎలా వాడతామో, ఇది కూడా అలాగే పనిచేస్తుంది. అలాగే మీ UPI యాప్స్ (PhonePe, Google Pay వంటివి) లేదా మీ బ్యాంక్ యాప్‌లో ఒక బటన్ లాగా కనిపిస్తుంది.
ఎప్పుడు వాడాలి అంటే :
ఎవరైనా మిమ్మల్ని ఫోన్ కాల్‌లో భయపెట్టి డబ్బులు పంపమని ఒత్తిడి చేస్తున్నా లేదా మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని మీకు అనుమానం వచ్చినా వెంటనే ఈ బటన్ నొక్కవచ్చు. ఈ స్విచ్ నొక్కగానే మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని ట్రాన్సక్షన్స్ నిలిచిపోతాయి. అంటే, మీ అకౌంట్ నుండి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ఫర్ కాదు. స్కామర్లు/మోసగాళ్లు మీ డబ్బును వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయకముందే మీరు ఈ బటన్ నొక్కి ఆపేయొచ్చు.
►ALSO READ | కూరగాయలు, పండ్లు, పాన్ షాపుల వాళ్ల కోసం కొత్త క్రెడిట్ కార్డ్.. ఇక వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగక్కర్లే.
ఫ్రాడ్ ఇన్సూరెన్స్
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆన్‌లైన్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ఇన్సూరెన్స్ (బీమా) విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం RBI (రిజర్వ్ బ్యాంక్) తో కలిసి ప్లాన్ చేస్తున్నారు.
ఈ నిర్ణయం ఎందుకు :
2024-25లోనే దాదాపు రూ. 34,771 కోట్ల మోసాలు జరిగాయి. స్కామర్లు పోలీసులమని చెప్పి వీడియో కాల్స్ చేసి, గంటల తరబడి ప్రజలను భయపెట్టి డబ్బులు లాగేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో బాధితులకు వారి అకౌంట్‌లను లాక్ చేసుకునే అధికారం ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని 2025 చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
