కూరగాయలు, పండ్లు, పాన్ షాపుల వాళ్ల కోసం కొత్త క్రెడిట్ కార్డ్.. ఇక వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగక్కర్లే..

కూరగాయలు, పండ్లు, పాన్ షాపుల వాళ్ల కోసం కొత్త క్రెడిట్ కార్డ్.. ఇక వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగక్కర్లే..

వీధి వ్యాపారులు అంటే చిన్న పండ్ల దుకాణాలు, కూరగాయలు అమ్ముకునే వాళ్లు, బడ్డీ కొట్లు, టీ దుకాణాలు ఇలా చిన్నచిన్న పనులతో వ్యాపారం చేసుకునే వ్యక్తులకు కొత్తగా క్రెడిట్ కార్డ్ వచ్చేసింది. అత్యవసర సమయంలో అప్పుల కోసం వడ్డీ వాళ్ల చుట్టూ తిరగకుండా రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా వ్యాపార అవసరాల కోసం డబ్బులను దీని నుంచి సెకన్లలో పొందొచ్చు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్ ఎవరికి ఇస్తారు, దాని రూల్స్ ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రధాని మోడీ జనవరి 23, 2026న సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన పీఎం స్వనిధి(PM SVANidhi) క్రెడిట్ కార్డ్ ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ క్రెడిట్ కార్డ్ ఒక కీలక మలుపుగా మారనుంది. కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకోవడానికి 2020లో ప్రారంభించిన ఈ స్కీమ్ ఇప్పుడు మరింత ఆధునీకరించి, వ్యాపారులకు డిజిటల్ గుర్తింపును కల్పించనుంది.

ALSO READ : బంగారం కొనలేక సామాన్యుడు.. అమ్మలేక చిన్న వ్యాపారి

పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ అనేది UPI-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది వీధి వ్యాపారులకు వడ్డీ లేని.. రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తుంది. అంటే వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార అవసరాలకు లేదా వ్యక్తిగత అత్యవసరాలకు ఈ కార్డు ద్వారా డబ్బును వాడుకోవచ్చు. పీఎం స్వనిధి స్కీమ్ కింద రెండవ విడత లోన్ సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ కార్డు అందిస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఏడాదికి రూ.12 వందల వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తున్నారు.

స్ట్రీట్ వెండార్స్ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. వారికి గుర్తింపు లేకపోవడం, ముఖ్యంగా బ్యాంకుల నుంచి లోన్స్ దొరకకపోవడం వంటి సమస్యలకు ఈ స్కీమ్ సమాధానంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వారికి బ్యాంకింగ్ వ్యవస్థలో అధికారిక గుర్తింపు లభిస్తుంది. కేవలం లోన్ మాత్రమే కాకుండా, వ్యాపారులకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధిలో కూడా శిక్షణ ఇస్తారు.