బంగారం కొనలేక సామాన్యుడు.. అమ్మలేక చిన్న వ్యాపారి: వెంటాడుతున్న డబ్బు కష్టాలు

బంగారం కొనలేక సామాన్యుడు.. అమ్మలేక చిన్న వ్యాపారి: వెంటాడుతున్న డబ్బు కష్టాలు

ఒకప్పుడు సామాన్యుడికి భరోసాగా, ఆడబిడ్డ పెళ్లికి ఆభరణంగా నిలిచిన బంగారం.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది. పసిడి ధరలు నిరంతరం పెరుగుతుండటం, మార్కెట్‌లో తీవ్రమైన అస్థిరత ఉండటంతో చిన్న గోల్డ్ షాపు యజమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తరతరాలుగా స్థానిక కస్టమర్లతో అనుబంధం పెంచుకున్న ఫ్యామిలీ జువెలర్స్, ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గడిచిన కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా చిన్న జువెలర్స్ వద్ద విక్రయాల వాల్యూమ్ 45 శాతం తగ్గిందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెరగకపోగా.. ఇంటి ఖర్చులు పెరగడంతో వారు బంగారానికి దూరమవుతున్నారు. మునుపటిలా ప్రజలు ప్లాన్ చేసి బంగారం కొనే పరిస్థితి లేదని, ప్రస్తుతం రోజువారీ అవసరాలే సవాలుగా మారాయని ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : రూ.16వేలకు చేరిన గ్రాము బంగారం..

పెద్ద చైన్ స్టోర్ల ధాటికి తట్టుకోలేక..
మార్కెట్‌లో తనిష్క్, కళ్యాణ్ జువెలర్స్, లలితా జువెలర్స్ వంటి మరెన్నో దిగ్గజ సంస్థలు దూసుకుపోతుంటే.. చిన్న వ్యాపారులు మాత్రం వెనుకబడిపోతున్నారు. పెద్ద సంస్థలు 18 క్యారెట్ల లైట్‌వెయిట్ నగలతో పాటు ఇటీవలి కాలంలో 9 క్యారెట్ల బంగారు నగలను కూడా ప్రవేశపెట్టి మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. కానీ పరిమిత పెట్టుబడి ఉండే చిన్న దుకాణదారులు కొత్త కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తీసుకురాలేకపోతున్నారు. దీనివల్ల కస్టమర్లు సహజంగానే ఎక్కువ వెరైటీలు ఉండే పెద్ద బ్రాండెడ్ స్టోర్ల వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది.

డబ్బు కొరత.. స్టాక్ పెట్టుకోలేని దుస్థితి
బంగారం దిగుమతులపై ఆధారపడే మన దేశంలో అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. ధరలు పెరగడం వల్ల కొత్త స్టాక్ కొనాలంటే వ్యాపారులకు భారీగా పెట్టుబడి అవసరమవుతోంది. ఒక పక్క డీలా పడ్డ అమ్మకాలతు.. మరో పక్క చేతిలో క్యాష్ లేక 'లిక్విడిటీ క్రంచ్' ఎదుర్కొంటున్నారు. పాత నగలను కరిగించి కొత్తవి చేయాలన్నా.. తరుగు, మజూరి వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తోందని చిన్న నగల వ్యాపారి వాపోతున్నారు.

చిన్న వ్యాపారులకు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజనే ప్రధాన ఆసరగా మిగిలింది. ఎందుకంటే వీరి వ్యాపారంలో 60-65 శాతం కేవలం పెళ్లిళ్ల నగలపైనే ఆధారపడి ఉంటుంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ స్థితిలో కస్టమర్లు పెళ్లిళ్లు ఉంటే తప్ప దుకాణం మెట్లు ఎక్కడం లేదు. స్థిరత్వం లేని ధరల వల్ల ప్లానింగ్ మొత్తం దెబ్బతింటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు చిన్న, మధ్యతరహా నగల వ్యాపారులు ఉన్నారు. కార్పొరేట్ సంస్థల విస్తరణ, ఆకాశాన్ని తాకుతున్న ధరల మధ్య వీరు నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. వీరు లైట్ వెయిట్లో స్టైలిష్ డిజైన్ల వైపు మళ్లకపోతే.. భవిష్యత్తులో ఈ రంగం పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.