మద్యపానం అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఒక అలవాటుగా లేదా స్టేటస్ గా మారిపోయింది. కానీ, మద్యం మన శరీరంపై, ముఖ్యంగా కాలేయంపై చూపే ప్రభావం చాలా ప్రమాదకరమైనది. చాలామంది సరదాకో, ఒత్తిడి తగ్గించుకోవడానికో సాయంత్రం పూట మందు తాగుతుంటారు. గ్లాసు ఖాళీ అవ్వగానే అయిపోయిందని అనుకుంటారు. కానీ, అసలు కథ శరీరం లోపల అప్పుడే మొదలవుతుంది. మన శరీరంలో 'ఫిల్టర్' లా పనిచేసే కాలేయం.. మీరు తాగిన మద్యాన్ని ఫిల్టర్ చేయడానికి విపరీతంగా కష్టపడుతుంది.
కాలేయం ఎందుకు దెబ్బతింటుంది?
మద్యాన్ని అరిగించే క్రమంలో కాలేయంలో 'అసిటాల్డిహైడ్' అనే ఒక పదార్థం తయారవుతుంది. ఇది కాలేయ కణాలను లోపల నుండి నాశనం చేస్తుంది. కాలేయానికి ఒక చెడ్డ అలవాటు ఉంది.. అది పూర్తిగా దెబ్బతినే వరకు ఎలాంటి నొప్పిని లేదా హెచ్చరికను బయటకు పంపదు. అందుకే చాలామందికి నొప్పి ముదిరాక లేదా ప్రమాదం జరిగిన తర్వాతే విషయం అర్థమవుతుంది.
రోజూ తాగితే వచ్చే ముప్పు
ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు పేరుకుపోవడం ఇది మొదటి దశ. కాలేయ కణాల్లో కొవ్వు చేరుతుంది. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు కాబట్టి మనం దీనిని లైట్ తీసుకుంటాం. మద్యం తాగడం ఆపకపోతే కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల విపరీతమైన అలసట వస్తుంది. అయినా చాలామంది దీనిని గుర్తించరు. ఇక చివరికి కాలేయం మొత్తం మచ్చలతో నిండిపోయి, రాయిలా గట్టిపడిపోతుంది. ఈ దశకు వస్తే కాలేయాన్ని తిరిగి బాగు చేయడం అసాధ్యం. ఇది ప్రాణానికే ముప్పు.
►ALSO READ | Good Health: షుగర్ లెవల్స్ కంట్రోల్ కావడం లేదా.. అయితే ఈ డైట్ మీకోసమే....
క్యాన్సర్ ప్రమాదం
మద్యం తాగడం వల్ల కేవలం కాలేయం కాదు, శరీరంలోని ఇతర భాగాలు కూడా క్యాన్సర్ బారిన పడవచ్చు. రోజూ తాగే వారికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మహిళల్లో అయితే మద్యం వల్ల హార్మోన్లు మారి రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. రోజూ ఒక పెగ్గు తాగినా ఈ ప్రమాదం 7 నుండి 10 శాతం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కొంచెం తాగితే ఏం కాదు అనేది నిజమేనా
మద్యపానంలో 'సురక్షితమైన పరిమితి' అంటూ ఏదీ లేదు. మీరు తక్కువ తాగినా శరీరంపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే.. కాలేయానికి తనను తాను బాగు చేసుకునే శక్తి ఉంది. మీరు మద్యం మానేసిన లేదా తగ్గించిన ఒక్క వారంలోనే కాలేయం మళ్లీ కోలుకోవడం మొదలవుతుంది.
