మన దేశం ఎన్నో రకాల సంస్కృతులు, వంటకాలకు ఫెమస్ అయితే ఇండియాలో ఉన్న ఈ ఊరులో మాంసాహారం పూర్తిగా నిషేధం. గుడ్డు, మాంసం ఇక్కడ అస్సలు ఉండదు. ప్రపంచంలోనే ఏకైక అధికారిక స్వచ్ఛమైన శాఖాహార నగరంగా పేరు పొందిన ఈ ఊరు పేరు పాలితానా (Palitana). ఇది గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది. ఇది అనుకోకుండా పెట్టుకున్న నిర్ణయం కాదు, అక్కడి ప్రజలు ఎంచుకున్న పద్ధతి.
పాలితానా పట్టణంలో వేల సంఖ్యలో జైన సన్యాసులు, భక్తులు, అహింసను బలంగా నమ్మే కుటుంబాలు ఉంటున్నాయి. జైన మతం ముఖ్య సిద్ధాంతం అహింస అంటే ఏ జీవిని బాధపెట్టకపోవడం లేదా చంపకపోవడం. అందుకే జంతువులను వధించడాన్ని, మాంసం తినడాన్ని వారు అంగీకరించరు. దీనికి సంబంధించి 2014 సంవత్సరంలో సుమారు 200 మంది జైన సన్యాసులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కుడ చేశారు.
ఈ ఉద్యమం కారణంగా, ప్రభుత్వం ఆ ప్రాంతంలోని దాదాపు 250 మాంసం దుకాణాలను మూసివేసింది. జైన సమాజం మనోభావాలను గౌరవిస్తూ గుజరాత్ ప్రభుత్వం గుడ్లు, మాంసం ఉత్పత్తుల అమ్మకం అలాగే వాడకాన్ని నియంత్రించింది.
ఈ నిషేధం వల్ల పాలితానా పట్టణంలో చాలా స్వచ్ఛమైన శాఖాహార రెస్టారెంట్‌లు వచ్చాయి. రుచికరమైన శాకాహార వంటకాల వెరైటీలు ఈ ఊరికి ప్రత్యేకత తెచ్చాయి. పాలితానా పట్టణం ప్రపంచంలోనే ప్రముఖ జైన యాత్రా స్థలాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ నిషేధం వలన మాంసాహారం తినే పర్యాటకులు ఆహార అప్షన్స్ తక్కువగా ఉన్నాయని అప్పుడప్పుడు విమర్శిస్తుంటారుకూడా .
