
- 27 నెలలుగా గవర్నమెంట్ సొమ్ము స్వాహా.. విచారణకు ఆదేశించిన టూరిజం ఎండీ
- ఇద్దరు ఏజీఎంల సస్పెన్షన్.. ఉద్యోగినిపై కేసు
హైదరాబాద్, వెలుగు: పర్యాటక శాఖలో భారీగా నిధుల మళ్లింపు జరిగింది. జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రుతి అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని.. ఏకంగా రూ.1.05 కోట్లను తన ప్రియుడి బ్యాంకు అకౌంట్‌కు మళ్లించినట్లు తేలింది. దీంతో సదరు ఉద్యోగినిపై కేసు నమోదు చేయడంతో పాటు డబ్బులు రికవరీకి ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలు జారీ చేశారు. నాలుగేండ్ల కింద టూరిజం శాఖలో కన్సల్టెంట్‌గా చేరిన శ్రుతి.. ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్ మోడ్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. సిబ్బంది, కార్మికులకు ఆర్టీజీఎస్ ద్వారా వేతనాలు పంపించే విధులు నిర్వర్తించేది. ఈ చెల్లింపులను అకౌంట్స్ ఏజీఎంలు పర్యవేక్షించాల్సి ఉన్నా.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఇదే అదునుగా భావించి నిధులు కాజేయడం మొదలు పెట్టింది. ప్రతినెలా వేతనాల చెల్లింపు సమయంలో వెండర్ పేరుతో కొంత మొత్తాన్ని అదనంగా జోడించి దారి మళ్లించేది. ఇలా 27 నెలల్లో ఏకంగా రూ.1.05 కోట్లు పక్కదారి పట్టించింది. ఇందులో రూ.80 లక్షలు ఒకే బ్యాంకు అకౌంట్లోకి జమ అయ్యాయి. ఆన్‌లైన్‌లో వేతనాలు చెల్లించేటప్పుడు ఒక ఉద్యోగి పేరును అదనంగా చేర్చి నిధులు డ్రా చేసింది. ఆమెకు 4 వేర్వేరు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ.. ఏడాది వారీగా లెక్కలు పరిశీలించడంతో ఈ బాగోతం బయటపడింది. నిధులపై కూపీ లాగగా, ఆ సొమ్మును ఆమె ప్రియుడి ఖాతాలో జమచేసినట్లు తేలింది. అకౌంట్స్ ఏజీఎంల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణం కావడంతో వారినీ సస్పెండ్ చేశారు. శ్రుతిపై కేసు నమోదు చేసి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తల్లిదండ్రులను ఆఫీస్ కు పిలిచి విచారించినట్లు తెలిసింది. దారి మళ్లించిన రూ.1.05 కోట్ల నిధులను రికవరీ చేయాలని ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కాగా, పర్యాటకశాఖ లో ప్రభుత్వ, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన డ్యూటీ చార్ట్ సరిగ్గా లేదు. ఉద్యోగులు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఉద్యోగులను ప్రతి మూడేండ్లకు ఓసారి.. విభాగాలు మారుస్తుండాలి. కానీ, అలా చేయకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతేగాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. గతంలో పర్యాటక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో విచారిస్తే గతంలో జరిగిన అక్రమాలు, నిధుల దారి మళ్లింపు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురుపేర్కొంటున్నారు.