
- ఉమ్మడి జిల్లాలో 1,16,768 టన్నుల వడ్ల పెండింగ్
- పట్టించుకోని కాంట్రాక్టు సంస్థలు
- అధికారులకు తప్పని తిప్పలు
జనగామ, వెలుగు: సీఎంఆర్ సకాలంలో ఇవ్వని మిల్లర్ల టెండర్ వడ్ల బకాయిల వసూలు ముందుకు సాగడం లేదు. వాయిదాలు పెరుగుతున్నా నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో మొత్తంగా 3,26,094 మెట్రిక్ టన్నుల వడ్లకు ఇప్పటివరకు 2,09,321 టన్నుల వడ్ల బకాయిలు వసూలయ్యాయి.
ఇంకా 1,16,768 టన్నుల వడ్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వం అందజేసిన వడ్ల నుంచి మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో మిగిలిపోయిన వడ్లకు టెండర్ వేయగా, టెండర్లు దక్కించుకున్న సంస్థలు మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేసి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
రెండుసార్లు టెండర్లు..
2022–23 సీజన్ లో సీఎంఆర్ కోసం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లోని మిల్లులకు సర్కారు కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను అందించారు. జనగామ జిల్లాలోని 42 మిల్లులు, హనుమకొండలో 33, జయశంకర్ భూపాలపల్లిలో 20, మహబూబాబాద్ లో 25, ములుగులో 22, వరంగల్ జిల్లాలో 66 మిల్లులు సీఎంఆర్ సకాలంలో ఇవ్వలేదు. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారు మిగిలిన వడ్లకు టెండర్ పిలిచింది. ఈ టెండర్లో పాల్గొన్న సంస్థలు క్వింటాలుకు రూ.1,700లు చెల్లిస్తామని కోట్ చేయగా, తక్కువ రేటుకు ఇచ్చేది లేదని సర్కారు వాటిని రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సదరు వడ్లకు తిరిగి టెండర్ పిలువగా, గతంలో పాల్గొన్న సంస్థలే మళ్లీ టెండర్ వేశాయి. కాగా, ఈసారి మాత్రం క్వింటాలుకు రూ.2 వేలు చెల్లిస్తామని కోట్చేశాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన టెండర్‌ను కేంద్రీయ బండార్ సంస్థ దక్కించుకుంది. ఆయా మిల్లుల్లో సీఎంఆర్ పెండింగ్ వడ్లను ఉన్నవి ఉన్నట్టుగా తీసుకుని టెండర్వేసిన ప్రకారం బకాయిలను మూడు నెలల్లో సర్కారుకు చెల్లించాల్సిన సంస్థలు అప్పట్లోనే మిల్లులను తనిఖీ చేసుకున్నాయి.
వడ్లకు బదులు పైసలు..
మిల్లుల్లో వడ్ల నిల్వలను పరిశీలించిన సంస్థలు వడ్లు లేని మిల్లర్లు క్వింటాలుకు రూ.2,223లను చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో బకాయి పడ్డ మిల్లులు సదరు వడ్లకు కొంతమేర చెల్లింపులు చేశాయి. జనగామ జిల్లాకు సంబంధించి 42 మిల్లులకు 6 మిల్లుల్లో 4,425 టన్నుల వడ్ల బకాయిలు పెండింగ్ఉన్నాయి. హనుమకొండలో 33 మిల్లులకు 7 మిల్లుల్లో 13,014 టన్నులు, జయశంకర్ భూపాలపల్లిలో 20 మిల్లుల్లో ఒక మిల్లు 21,042 టన్నులు, మహబూబాబాద్‌లో 25 మిల్లుల్లో 40,758 టన్నులు, వరంగల్ జిల్లాలో 66 మిల్లులకు 14 మిల్లుల్లో 32,234 టన్నుల టెండర్ వడ్లు బకాయి ఉన్నాయి.
బకాయిల వసూళ్లకు చర్యలు..
2022-23 సీజన్ టెండర్వడ్ల బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నం. అప్పట్లో సీఎంఆర్ సేకరణకు కటాఫ్ పెట్టి మిల్లుల్లో నిల్వ ఉన్న మిగిలిన వడ్లకు సర్కారు టెండర్లు పిలిచింది. ఈ టెండర్ దక్కించుకున్న వారు బకాయిల చెల్లింపులో కొంత జాప్యం చేస్తున్నారు. జనగామ జిల్లాలో ఇంకా 4 వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల వడ్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 90 శాతం బకాయిలు వసూలు చేశాం. - వీ హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ
ఉమ్మడి జిల్లాలో వడ్ల టెండర్, బకాయి వివరాలు..
జిల్లా మొత్తం టెండర్ అప్పగించిన వడ్లు పెండింగ్ వడ్లు పూర్తైన శాతం
వడ్లు (ఎం.టీ.ల్లో)
జనగామ 46,686 42,260 4425 90.52
హనుమకొండ 49,280 36,265 13,014 73.59
భూపాలపల్లి 66,114 45,071 21,042 68.67
మహబూబాబాద్ 60,472 19,714 40,758 32.60
ములుగు 28,452 23,346 5,105 82.05
వరంగల్ 75,090 42,665 32,424 56.82