వడ్ల కొనుగోళ్లపై ఫోకస్.. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరి కోతలు ఆలస్యం

వడ్ల కొనుగోళ్లపై ఫోకస్.. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరి కోతలు ఆలస్యం
  • వడ్లు వచ్చినా కొన్నిచోట్ల సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు
  • హనుమకొండ జిల్లా టార్గెట్ 1.7 లక్షల మెట్రిక్​టన్నులు
  • ఇప్పటివరకు కొన్నది 5,430 టన్నులు మాత్రమే..
  • క్షేత్రస్థాయి నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్

హనుమకొండ, వెలుగు: మొంథా తుఫాన్ వరి కోతలపై తీవ్ర ప్రభావం చూపింది. సైక్లోన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురవగా, కోతకు వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. ఆ ఎఫెక్ట్ తో కోతలు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడిప్పుడే కోతలు స్పీడందుకుని వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నా, సెంటర్ల నిర్వాహకుల అవగాహన లోపంతో కొనుగోళ్లు లేట్ అవుతున్నాయి. ఇటీవల కలెక్టర్ స్నేహ శబరీశ్ ఫీల్డ్ విజిట్ చేసి సెంటర్ల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్ టైంలోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గడువులోగా ధాన్యం కొనుగోలు టార్గెట్ రీచ్ అయ్యేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వర్షాల ప్రభావంతో ఆలస్యం..

హనుమకొండ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 1.46 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ, మొంథా తుఫాన్ వల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. దీంతో కోతలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలో సగం వరకు కోతలు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 161 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రతిపాదించారు. జిల్లాలో ఫస్ట్ క్రాప్ వచ్చే కమలాపూర్, ఎల్కతుర్తి, హసన్ పర్తి మండలాలతోపాటు మరికొన్ని చోట్ల 96 సెంటర్లు ఓపెన్ చేశారు. ఇందులో ఐకేపీ 30, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మరో 62 సెంటర్లు మాత్రమే కొనుగోళ్లు స్టార్ట్ చేశాయి. మిగతా చోట్లా కోతలు జరుగుతుండగా, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో పడ్డారు. 

కొనుగోళ్లు డెడ్ స్లో..

జిల్లాలో ఇటీవల వడ్ల కొనుగోలు కుంభకోణం బయటపడగా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పై ఆఫీసర్లు ఫోకస్ పెంచారు. కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు జరగకుండా సీఏలు, సీసీలు, ఏపీఎంలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు పెట్టారు. కానీ, ఐకేపీలో కొత్త సభ్యులకు కొనుగోలు బాధ్యతలు అప్పగించగా, కొంతమందిలో అవగాహన లోపం ఇబ్బందులకు కారణమవుతోంది. రికార్డుల నిర్వహణతో పాటు గన్నీ సంచులు సరిపడా తెప్పించకపోవడం, మిల్లుల అలాట్ మెంట్, వడ్లను మిల్లులకు తరలింపులో జాప్యం, ఇతర సమస్యల కారణంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. 

కాగా, 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే అంచనాతో జిల్లావ్యాప్తంగా 50 మిల్లులను అలాట్ చేయగా, ఇప్పటివరకు 1,068 రైతులకు సంబంధించి రూ.12.97 కోట్ల విలువైన 5,430 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఈ మేరకు 203 మంది రైతులకు రూ.2.5 కోట్లు చెల్లించారు. 

కలెక్టర్ ఆదేశాలతో స్పీడప్..

ఈపాటికల్లా జిల్లా టార్గెట్ లో సగానికిపైగా కొనుగోలు పూర్తి కావాల్సి ఉండగా, పది శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. అనుకున్నంతగా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఇటీవల కలెక్టర్ స్నేహ శబరీశ్, సివిల్ సప్లైస్ డీఎం మహేందర్, డీఆర్డీవో మేన శ్రీను, ఇతర ఆఫీసర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేశారు. ఎల్కతుర్తిలో సెంటర్ నిర్వాహకుల పనితీరును గమనించి, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులను మార్చాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. 

అనంతరం కలెక్టర్ ఆదేశాలతో కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సీసీలు, ఏపీఎంలను మానిటర్ చేస్తూ కొనుగోళ్లలో వేగం పెంచేలా యాక్షన్ తీసుకుంటున్నారు. ఏరోజుకారోజు నివేదికలు తెప్పించుకుని కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు.