అద్దె బైకులతో పార్ట్ టైం సంపాదన

అద్దె బైకులతో పార్ట్ టైం సంపాదన
  • సిటీలో రెంటల్​ బైకుల హవా
  • 50 శాతం పార్ట్ టైం జాబర్స్ వీటినే వాడుతున్నరు
  • అందుబాటులో డైలీ, మంత్లీ ప్యాకేజీలు
  • స్కూటీలకు ఎక్కువ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సిటీలోని వేర్వేరు చోట్ల పని.. నాలుగైదు ప్లేసులు తిరగాలి.. బస్సులు, ఆటోలు మారి వెళ్దామంటే టైం వేస్ట్.. మరి ఎలా వెళ్లాలి? ఫుడ్ డెలివరీ బాయ్ గా, ఓలా, ఉబర్​లో పనిచేయాలన్నా బైక్​కంపల్సరీ. మరి బైక్​ఎలా వస్తది? కొందామంటే రూ.లక్ష కావాలి. ఇన్​స్టాల్​మెంట్​లో తీసుకుందాం అంటే  డౌన్​ పేమెంట్​ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికీ వన్​స్టాప్ ​సొల్యూషన్ ​రెంటెడ్ ​బైక్స్. సిటీలో ప్రస్తుతం వీటి హవానే నడుస్తోంది. ఆయా కంపెనీలు టూ వీలర్స్​ను గంటల లెక్కన, నెల రోజుల చొప్పున అద్దెకు ఇస్తుండడంతో పార్ట్ టైం, ఫుల్‍ టైం జాబ్స్​చేసేవారు, పని మీద సిటీకి వచ్చేవాళ్లు ఎక్కువగా వీటినే యూజ్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. 
5 వేల వెహికల్స్
ఓగో, బౌన్స్, క్విక్ బైక్, ఆన్ బైక్, జింగ్ బైక్స్, తాజో బైక్ ఇలా సిటీలో ఆయా కంపెనీలకు చెందిన 5 వేల టూవీలర్స్​ఉన్నాయి. వాటిలో స్కూటీల నుంచి పెద్ద పెద్ద బైక్స్ కూడా ఉన్నాయి. బైక్​ను బట్టి ఒక్కోదాని రెంట్​రూ.150 నుంచి రూ.2వేల వరకు ఉంది. నెల లెక్కన రూ.3,900 నుంచి ప్యాకేజీలు ఉన్నాయి. ఓగో, బౌన్స్ కంపెనీల వద్ద కేవలం స్కూటీలే ఉన్నప్పటికీ సిటీలో వాటి సంఖ్యే ఎక్కువ. ఈ రెండింటిలో కలిపి 3 వేల స్కూటీలు ఉన్నాయి.    
అంతా ఆన్ లైనే..
రెంటల్ ​ బైక్ ​తీసుకోవాలంటే ప్రాసెస్ ​అంతా ఆన్ లైన్ లోనే ఉంటుంది. కంపెనీ యాప్ ​డౌన్​లోడ్ చేసుకొని డ్రైవింగ్‍ లైసెన్స్, సెల్ఫీ ఫొటో అప్‍ లోడ్ చేసిన తరువాత బైక్​  బుక్ చేసుకోవచ్చు. రూ.500 డిపాజిట్​తో పాటు గంటలు లెక్కనో, నెలకనో ఎంటర్​చేసి అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత దగ్గరలోని స్టేషన్​ను సెలక్ట్ చేసుకొని అక్కడికి వెళ్లి బైక్​ తీసుకోవచ్చు. పెట్రోల్‍ బంక్ వరకు వెళ్లేంత పెట్రోల్‍ పోసి బైక్​ను అప్పగిస్తారు. డిగ్రీ, బీటెక్​ స్టూడెంట్స్​తోపాటు జాబ్ ​కోచింగ్స్​కోసం సిటీకి వచ్చినోళ్లు ఎక్కువగా బైక్స్​ని రెంటుకు తీసుకుంటున్నారు. ఉదయం కాలేజీకి వెళ్లేలోపు ఫుడ్ డెలివరీలతో పాటు ఓలా, ఉబర్ ​రైడ్స్ ​వేస్తూ కొంత సంపాదిస్తున్నారు. తిరిగి కాలేజీ నుంచి రాగానే సాయంత్రం కూడా అదే పనిచేస్తున్నారు. ఇలా వెహికల్‍ రెంట్‍, పెట్రోలు ఖర్చు పోనూ డైలీ రూ.300కు పైనే సంపాదిస్తున్నారు. 
ఫుల్ డిమాండ్ ఉంది
మా కంపెనీలో ప్రస్తుతం అన్ని స్కూటీలే ఉన్నాయి. సిటీలో మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి. కీ లేని బైక్​ను తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారో అక్కడే డిపాజిట్ చేయాలి. కీ ఉన్న బైక్​ను సిటీలో ఎక్కడైనా డిపాజిట్ చేసి వెళ్లొచ్చు. కరోనాకి ముందు చాలా మంది గంటల లెక్కన తీసుకునేవారు. ప్రస్తుతం నెల లెక్కన తీసుకుంటున్నారు.   ప్రతి బైక్​కు జీపీఎస్ కనెక్టివిటీ ఉంటుంది. - ఓగో కంపెనీ ఎగ్జిక్యూటివ్
ఆఫీసుకి వెళ్లేందుకు తీసుకున్న
మాది కోదాడ. సాఫ్ట్ వేర్ కంపెనీలో ట్రైనింగ్‍ కోసం సిటీకి వచ్చా. 4 రోజులు ఉండాల్సి ఉంది. ఉన్నన్ని రోజులు ఆఫీసుకి వెళ్లేందుకు, టైం సేవ్‍ అవుతుందని ఆన్‍ లైన్ లో బుక్ చేసుకొని ఓగోలో స్కూటీ తీసుకున్నా. - సుమన్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్