Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. ఇండియాలోనే సెమీ ఫైనల్, ఫైనల్.. వేదికలు ఎక్కడంటే..?

Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. ఇండియాలోనే సెమీ ఫైనల్, ఫైనల్.. వేదికలు ఎక్కడంటే..?

విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం (అక్టోబర్ 21) సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిన పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌‌ను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి  312 స్కోరు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను మొదట 40 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్‌‌లో లారా వోల్‌‌వర్త్‌‌ (90), మారిజేన్‌ కాప్ (68 నాటౌట్‌‌), సునె లుస్‌‌ (61) దుమ్మురేపారు. తజ్మిన్‌‌ బ్రిట్స్‌‌ (0) విఫలమైనా.. వోల్‌‌వర్త్‌‌ చెలరేగింది.

లుస్‌‌తో రెండో వికెట్‌‌కు 118, కాప్‌‌తో మూడో వికెట్‌‌కు 64 రన్స్‌‌ జోడించింది. మధ్యలో డెరెక్‌‌సన్‌‌ (9), కరాబో మెసో (0) నిరాశపర్చినా.. కాప్‌‌, చోలే ట్రయాన్‌‌ (21), డి క్లెర్క్‌‌ (41) మధ్య 93 రన్స్‌‌ జతయ్యాయి. పాకిస్థాన్ బౌలర్లలో సాదయా ఇక్బాల్‌‌, నషారా సంధు చెరో మూడు వికెట్లు తీశారు. సఫారీల బ్యాటింగ్ తర్వాత మరోసారి వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పాకిస్థాన్ కు 20 ఓవర్లలో 234 పరుగుల టార్గెట్ సెట్ చేశారు. భారీ ఛేజింగ్ లో పాకిస్థాన్ కేవలం 7 వికెట్ల నష్టానికి 83 పరుగులకే ఆలౌట్ అయింది.

సిద్రా నవాజ్‌‌ (22 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. నటాలియా పెర్వియాజ్‌‌ (20) మోస్తరుగా ఆడినా మిగతా వారు తేలిపోయారు. కాప్‌‌ 3, నోండుమిసో షాంగాసే 2 వికెట్లు పడగొట్టింది. కాప్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఫలితంగా 10 పాయింట్లతో సఫారీ జట్టు టాప్‌‌లోకి దూసుకొచ్చింది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన 6 మ్యాచ్ ల్లో ఒక విజయం కూడా లేకుండా 2 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది.  

ఇండియాలోనే సెమీ ఫైనల్, ఫైనల్.. 

పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్ కావడంతో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు ఇండియాలోనే జరగనున్నాయి. మొదట సెమీ ఫైనల్   గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం రెండో సెమీ ఫైనల్ యధావిధిగా నవీ ముంబైలో జరగనుంది. మెగా ఫైనల్ కూడా నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్నాయి. 

బంగ్లాదేశ్, పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లలో ఒక జట్టు సెమీస్ కు చేరనుంది. దేశ ఉద్రిక్తల పరిస్థితుల కారణంగా ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ కు చేరి ఉంటే కొలంబోలో సెమీస్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ గ్రూప్ దశలో నిష్క్రమించడంతో నాకౌట్ మ్యాచ్ లపై క్లారిటీ వచ్చింది.