
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 4 రోజులు టూర్ లో భాగంగా.. 2025, అక్టోబర్ 22వ తేదీ కేరళ వచ్చిన రాష్ట్రపతి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అంటే విధివిధానాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రపతి ముర్ము సంప్రదాయాలను పాటించారు. నల్లటి దుస్తులు ధరించారు రాష్ట్రపతి ముర్ము. ఇరుముడి కట్టారు. తలపై ఇరుముడితో.. 18 బంగారు మెట్లు ఎక్కారు రాష్ట్రపతి. ఆ తర్వాత కొండపై అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సంప్రదాయ బద్దంగానే ఆమె పర్యటన, దర్శనం సాగింది. రాష్ట్రపతి వెంట ఉన్న సెక్యూరిటీ, భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితోనే మెట్లు ఎక్కారు.. స్వామి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం పూజలు ముగిసే ముందు రాష్ట్రపతి సన్నిధానంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
ALSO READ : మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.30 వేల జీతం..
తిరువనంతపురం నుంచి పతనంతిట్ట వరకు రోడ్డు మార్గంలో వచ్చారు రాష్ట్రపతి. అక్కడి నుంచి కొండ ఆలయం బేస్ స్టేషన్ అయిన పంపాకు చేరుకున్నారు. శబరిమల ఆలయం ఆచారం ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆచార వ్యవహారాల ప్రకారమే రాష్ట్రపతి వ్యవహరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వయస్సు 67 సంవత్సరాలు.
52 ఏళ్ల తర్వాత శబరిమలను దర్శించుకున్న రెండో రాష్ట్రపతి :
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతులు ఇద్దరు మాత్రమే. 1973లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి, ఆయన కుమారుడుతోపాటు మరికొందరు ఎంపీలతో కలిసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. 52 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ఇరుముడితో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతుల్లో మహిళా రాష్ట్రపతి స్వామి దర్శనం చేసుకోవటం ఇదే ప్రథమం.