టేకాఫ్ తీసుకుంటున్న విమానంలోంచి దూకేశాడు

టేకాఫ్ తీసుకుంటున్న విమానంలోంచి దూకేశాడు

లాస్ ఏంజిల్స్: టేకాఫ్ కు సిద్ధమై బయల్దేరిన విమానంలో నుంచి ఓ వ్యక్తి హఠాత్తుగా దూకేశాడు. హఠాత్తుగా ఊహించని రీతిలో జరిగిన ఘటనతో విమానాశ్రయంలో కలకలం రేపింది. ఏం జరిగిందోననే ఆందోళనతో విమానశ్రయ భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టడంతో పలు విమానాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. శుక్రవారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
శుక్రవారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఓ విమానం స్టాల్ లేక్ నగరానికి బయలుదేరింది. యునైటెడ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన విమానం రన్ వే పై పరుగులు తీయడం ప్రారంభించిన కాసేపటికే ఓ ప్రయాణికుడు తన సీట్లో  నుంచి లేచి కాక్ పిట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అది తెరచుకోలేదు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ద్వారం వద్దకు వచ్చి ఆ డోర్ తెరచి దూకేశాడు. వేగంగా కదులుతున్న విమానంలో నుంచి దూకేయడంతో గాయాలై కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఏటీసీ, భద్రతా సిబ్బంది ఈ ప్రయాణికుడు ఎందుకు దూకేశాడో అర్థం కాక ఎమర్జెన్సీ అలారం మోగించారు. సెక్యూరిటీ సిబ్బంది, వైద్యులు హడావుడిగా అతని వద్దకు చేరుకుని ఏం జరిగిందని ఆరా తీశారు.  ప్రాధమిక వైద్య చికిత్స చేస్తూనే అతనితో మాట్లాడారు. సరైన కారణం చెప్పకుండా పలురకాల కథనాలు వినిపించడంతో సెక్యూరిటీ సిబ్బందికి అర్థం కాలేదు. వాస్తవాలు నిగ్గు వెలికితీసేందుకు కేసును  ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) అధికారులకు అప్పగించారు.

రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గురువారం నాడు ఇదే విమానాశ్రయం వెనుకవైపు ఉన్న ఫెన్సింగ్ ను  ఓ కారు డ్రైవర్ హఠాత్తుగా డీకొట్టి ఏకంగా రన్ వే పైకి వచ్చేశాడు. హఠాత్తుగా జరిగిన ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది  అప్రమత్తమై ఆ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వ్యవహారమే కొల్లిక్కి రాకముందే.. ఈ ఘటన జరగడంతో ఎఫ్.బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.