హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ సీడ్స్ సరఫరాదారులకు బకాయిలు చెల్లించాలన్న తమ మునుపటి ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, లేకుంటే డిసెంబర్ 5న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2023-24 ఏడాదికి చేప పిల్లల (ఫిష్ సీడ్స్) పంపిణీదారులకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆర్‌కే ఫిషరీస్ ట్రేడర్స్ అండ్ సీడ్ సప్లయర్స్ తో పాటు మరికొందరు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌లపై జస్టిస్ కె. శరత్ విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది మరో నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వచ్చే విచారణ తేదీకి హైకోర్టు గత ఉత్తర్వులను పూర్తిగా అమలు చేసి, బిల్లులు చెల్లించాలన్నారు.
