
లాహోర్: ఇండియా, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలన్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్లాన్ బెడిసి కొట్టింది. పీఎస్‌ఎల్‌లో మిగిలిన 8 మ్యాచ్‌లను రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో నిర్వహించాల్సి ఉండగా వాటిని యూఏఈలో షెడ్యూల్ చేస్తామని శుక్రవారం ఉదయం పీసీబీ ప్రకటించింది. కానీ ఈ ప్రతిపాదనను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తిరస్కరించినట్లు సమాచారం. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ సూచన మేరకు పీఎస్‌ఎల్‌ను వాయిదా వేశారు.
‘ఇండియా నుంచి ఎదురవుతున్న దాడుల నేపథ్యంలో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పీఎస్‌ఎల్‌ను వాయిదా వేస్తున్నాం. పాకిస్తాన్ సౌర్వభౌమత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్న మా దేశ సాయుధ దళాల సాహసోపేత ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నాం. మా ప్రధాని ఇచ్చిన సలహా మేరకు మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. అమరవీరుల ఫ్యామిలీలకు , దేశాన్ని రక్షించే మా భద్రతా సిబ్బందికి పీసీబీ, ప్లేయర్లు సంఘీభావంగా నిలుస్తున్నారు’ అని పీసీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక పీఎస్‌ఎల్‌కు ఆతిథ్యం ఇస్తే పీసీబీకి తాము మద్దతు ఇస్తున్నట్లు కనిపించొచ్చని, అది తమకు ఇష్టం లేదని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.