స్విస్‌‌‌‌ ఓపెన్‌.. క్వార్టర్స్‌‌‌‌లో తెలంగాణ షట్లర్‌‌‌‌ మన్నేపల్లి తరుణ్‌

స్విస్‌‌‌‌ ఓపెన్‌.. క్వార్టర్స్‌‌‌‌లో తెలంగాణ షట్లర్‌‌‌‌ మన్నేపల్లి తరుణ్‌

బాసెల్‌‌‌‌: తెలంగాణ షట్లర్‌‌‌‌ మన్నేపల్లి తరుణ్‌‌‌‌ స్విస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో తరుణ్‌‌‌‌ 21–14, 22–20తో జస్టిన్‌‌‌‌ హోహ్‌‌‌‌ (మలేసియా)పై గెలిచాడు. 43 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో తెలంగాణ ప్లేయర్‌‌‌‌ బలమైన స్మాష్‌‌‌‌లు, క్రాస్‌‌‌‌ కోర్టు ర్యాలీలతో ఆకట్టుకున్నాడు.

తొలి గేమ్‌‌‌‌లో 5–5తో స్కోరు సమమైన తర్వాత తరుణ్‌‌‌‌ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 9–5 ఆధిక్యంలో నిలిచాడు. స్కోరు 14–13 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన తరుణ్ ఓ బలమైన స్మాష్‌‌‌‌తో గేమ్‌‌‌‌ను ముగించాడు.

రెండో గేమ్‌‌‌‌లో పుంజుకున్న జస్టిన్‌‌‌‌ గట్టి పోటీ ఇచ్చాడు. ఓ దశలో తరుణ్‌‌‌‌ 13–7తో ముందంజ వేసినా తర్వాత వరుసగా ఆరు పాయింట్లు ఇచ్చుకోవడంతో స్కోరు 13–13తో సమమైంది. ఈ టైమ్‌‌‌‌లో వ్యూహాత్మకంగా ఆడిన తరుణ్‌‌‌‌ మళ్లీ లీడ్‌‌‌‌లోకి వచ్చాడు. 20–20 వద్ద తరుణ్ రెండు కీలక పాయింట్లు నెగ్గి గేమ్‌‌‌‌, మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి జోడీ... క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ నుంచి వైదొలిగింది. సాత్విక్‌‌‌‌ భుజం నొప్పి రావడంతో  ఇండియా జోడీ ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది.