ఇంద్రవెల్లిలో తొలి అడుగు..మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద

 ఇంద్రవెల్లిలో తొలి అడుగు..మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద
  • రావిర్యాల కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా: ‘‘ఇంద్రవెల్లిలో తొలి అడుగు పడింది... మలి అడుగు రావిర్యాలలో ఇప్పుడు వేశాం.. ఇక మూడో అడుగు పడేది కేసీఆర్ నెత్తిమీద.. టీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కుతం.. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వరుణ దేవుడు కూడా రావడం శుభసూచకం..’’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ‘దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ జరిగింది. ప్రతి పార్లమెంటు పరిధిలో దండోరా సభలను నిర్వహించాలన్న పార్టీ నిర్ణయంలో భాగంగా రావిర్యాలలో నిర్వహించిన సభలో పార్టీ నాయకులతోపాటు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. 
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షం వస్తున్నా లెక్కచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఓపికగా ఎదురుచూస్తున్నారని..  ప్రజల ఉత్సాహం చూస్తుంటే... కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం  అన్నారు. ఇంకా 19 నెలలు దరిద్రుడిలో పాలనలో ఉండాలా..అని ఎదురు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే దళిత కుటుంబానికి  10 లక్షలు ఇస్తా మంటున్నారని ఆరోపిపంచారు. జై భీం..జై గోండు.. అన్న వాళ్లను ఆదుకోవొద్దా.. తెలంగాణ కోసం సచ్చింది ఎవరు...?  వచ్చిన తెలంగాణను దోసుకుంటుంది ఎవరు..?  ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోనియా గాంధీ నిర్ణయం తో ప్రగతి భవన్ లో పిడుగు పడిందని, కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. అందుకే కాలు కాలిన పిల్లి లెక్క కేసీఆర్ తెలంగాణలో తిరుగుతున్నాడని అన్నారు. కేసీఆర్ ఇస్తా అన్న 10 లక్షలు నీ భిక్ష ఎంత మాత్రం కాదని, పేద ప్రజల పన్నుల తో వచ్చిన  డబ్బే ఇస్తున్నారు. ఇచ్చే 10 లక్షల్లో నీ ఫామ్ హౌజ్ నుండి ఇస్తున్నవా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల కిందనే భూములు ఇచ్చాం..ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం, రిజర్వేషన్ ఇచ్చింది మేము, ఉపాధి ఇచ్చింది మేము... ఫీల్డ్ అసిస్టెంట్లను రోడ్డు మీద పడేసింది నువ్వు.. నీకు అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి నీళ్లు తాగుతారు, కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. కేసీఆర్ హాయాంలో ఉద్యోగాలు వచ్చాయా ? పావలా వడ్డీ లు వచ్చాయా ? కానీ కేసిఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక అమరుల కుటుంబాలకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. 
ఏడేళ్లు హక్కులు కాలరాసిన ద్రోహి కేసీఆర్: ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ 
ఏడు సంవత్సరాలు దళితుల హక్కులని కేసీఆర్ కాలరాశాడని ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కెసిఆర్ ఊసరవెల్లి లా రంగులు  మారుస్తున్నాడని ఆయన విమర్శించారు. పార్లముంటలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లును పాస్ చేసిన తల్లి  మీరాకుమారి హైదరాబాద్ వస్తే కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మీరాకుమారికి అపాయింట్మెంట్ ఇవ్వని కెసిఆర్ ఆమె తండ్రికి పూలమాల వేశాడని అన్నారు. పోడు భూములు , మూడు ఎకరాల భూమి ,రిజర్వేషన్లు ఇవ్వని దళిత బంధా..? ..దళిత రాక్షసా..? ఏనాడూ అంబేడ్కర్ కు పూల మాల వేయని కేసీఆర్ నిన్న అంబేడ్కర్ కి పూలమాల వేశాడని ఆయన ఎద్దేవా చేశారు. 
కేసీఆర్ మాట తప్పడంటున్నారు.. మరి దళితుడ్ని సీఎం చేయలేదని క్షమాపణ చెప్పండి
తెలంగాణలో దొరసామ్యం కొనసాగుతుందని, కేసిఆర్ మాట అంటే తప్పడు అంటున్న ఆయన తనయుడు మంత్రి  కేటీఆర్, దళితున్ని సీఎం చేయలేదు కదా, క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. దళితులకు దళిత బంధు కింద పది లక్షలతో పాటు మూడెకరాల భూమి ఇవ్వాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు ఐక్యం కావాలని, దళిత బంధు మాదిరిగా గిరిజన, మైనార్టీల, మహిళల, బీసీల, బడుగు జీవుల బంధులు కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని బంధులు ఇచ్చి తాగుడు బంద్ చేయాలని ఎమ్మెల్యే సీతక్క సూచించారు.