- యువకులు తొందరపడి ప్రాణత్యాగం చేసుకోవద్దు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని.. ఈ విషయంలో బీసీ యువకులు తొందరపడి ప్రాణత్యాగం చేసుకోవద్దని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ యువతకు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం అంబర్ పేట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నామన్నారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. అప్పుడు ఈ బీసీ రిజర్వేన్ల అమలును ఎవరూ ఆపలేరు’’అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదనే మనస్తాపంతో సాయి ఈశ్వర్ చారి ప్రాణత్యాగం చేసుకోవడం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మహేశ్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రాణాలు అత్యంత విలువైనవి అని.. ఏ ఒక్కరూ ఇలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని కోరారు. బీసీ వ్యతిరేక భావజాలం ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మహేశ్ గౌడ్ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం, కాంగ్రెస్ పార్టీ వీటి అమలు కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని, సాధించి తీరుతామని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మరోసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని, ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిన అధ్యాయం కాదని, అవి సాధించే వరకు చట్టపరంగా, న్యాయ పరంగా పోరాడి, సాంకేతికపరమైన ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు.
