కాంగ్రెస్ సర్కార్ మీద అక్కసుతోనే యూరియా ఇవ్వట్లే

కాంగ్రెస్ సర్కార్ మీద అక్కసుతోనే యూరియా ఇవ్వట్లే
  • పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్​
  • బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసికుట్ర చేస్తున్నాయని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసుతోనే రాష్ట్రానికి కేంద్రం యూరియా ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్  సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. యూరియా కోసం తెలంగాణలో రైతులు ఆందోళనలు చేస్తుంటే ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీలో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే చొరవ తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే రాష్ట్రానికి యూరియా రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని  రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటా కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పలుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా, స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా.. కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం  వివక్ష సరైంది కాదన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, ప్రధాని మోదీ ఇప్పటికైనా యూరియా విషయంలో స్పందించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.